Asianet News TeluguAsianet News Telugu

sankranthi 2022: మొద‌లైన సంక్రాంతి సంబురాలు.. గొబ్బెమ్మ‌ను ఎందుకు పెడ‌తారో తెలుసా?

sankranthi 2022: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘ‌నంగా జరుపుకునే పండుగ‌ల్లో సంక్రాంతి ఒక‌టి.  మూడు నుంచి నాలుగు రోజుల పాటు పెద్ద ఎత్తున సంక్రాంతిని జ‌రుపుకుంటారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండగ నిర్వహిస్తారు. అయితే, ఈ సంక్రాంతి అన‌గానే మొద‌ట గుర్తొచ్చేది భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, అందులో పెట్టే గొబ్బెమ్మ‌లు.. సంక్రాంతి పండ‌గ‌లో గొబ్బెమ్మ‌ల‌కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. 
 

The Speciality of Sankranti- gobbemma importance
Author
Hyderabad, First Published Jan 12, 2022, 3:03 PM IST

sankranthi 2022: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘ‌నంగా జరుపుకునే పండుగ‌ల్లో సంక్రాంతి ఒక‌టి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ద‌క్షిణ భార‌తంలో జ‌రుపుకునే అతి పెద్ద పండుగ‌ల్లో ఒక‌టిగా సంక్రాంతికి గుర్తింపు ఉంది. మూడు నుంచి నాలుగు రోజుల పాటు పెద్ద ఎత్తున సంక్రాంతిని జ‌రుపుకుంటారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండగ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‏లో పెద్ద ఎత్తున సంక్రాంతిని జరుపుకుంటారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ పండగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు. బంధువులు, కుటుంబ సభ్యుల‌తో సంక్రాంతి కోలాహ‌లం మాములుగా ఉండ‌దు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండగ నిర్వహిస్తారు. భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు, ఇంటి ముందు గొబ్బెమ్మలు ఇలా ఒక్కటేమిటీ సంక్రాంతి సందడి ఎక్కువగానే ఉంటుంది. పట్నం వ‌దిలి సంక్రాంతి కోసం జ‌నాలు ప‌ల్లే బాట ప‌ట్టారు. అప్పుడే సంక్రాంతి సంబురాలు మొద‌లైన వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. 

సంక్రాంతి అన‌గానే మొద‌ట గుర్తొచ్చేది భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, అందులో పెట్టే గొబ్బెమ్మ‌లు, బంధువుల కోలాహ‌లం మొద‌లైన ఉంటాయి. అయితే,  సంక్రాంతి పండ‌గ‌లో గొబ్బెమ్మ‌ల‌కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. హిందూ సాంప్ర‌దాయంలోనే గొబ్బెమ్మ‌ల‌ను ప్ర‌ధాన్యం ఎంతో ఉంది. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఇంటిముంద‌ర రంగవల్లులు, మధ్యలో గొబ్బెలు ఉంచుతారు.  ధ‌నుర్మాసం ప్రారంభమైన‌ప్ప‌టి నుంచి నెలరోజుల పాటు వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను ఉంచుతారు. అయితే, కాలంలో వ‌చ్చిన మ‌ర్పుల నేప‌థ్యంలో నెల రోజుల పాటు ముంగిట్లో రంగ‌వ‌ల్లులు, అందులో గొబ్బిమ్మ‌ల‌ను చేసే పెట్ట‌డం త‌గ్గిపోయింది. అయితే, సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో సంక్రాంతి, భోగి, కనుమ రోజులు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఎంతో అందంగా ముగ్గులు వేసి రంగులతో అలంకరిస్తారు. ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచుతారు. 

హిందూ సంప్రదాయంలో గొబ్బెమ్మలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గొబ్బెమ్మను గౌరిమాతగా కొలుస్తారు. మరికొన్ని చోట్ల గొబ్బెమ్మను కాత్యాయినీ దేవిగానూ పూజిస్తారు. అందుకే సంక్రాంతి పండుగ రోజుల్లో ఇంటి ముంద‌ర రంగురంగుల రంగ‌వ‌ల్లులు వేసి.. అందులో గొబ్బెమ్మ‌ల‌ను ఉంచుతారు. ధ‌నుర్మాస రోజుల్లో ఇంటిముందు ముగ్గులు వేసి.. వాటి మ‌ధ్య పెట్టే గొబ్బెమ్మ‌ల‌ను త‌యారు చేయ‌డానికి పేడ‌ను ఉప‌యోగిస్తారు. ఆవును గౌరీమాతగా కొలిచే సంప్రదాయం భార‌త్ లో ఉంది. అందుకే ఆవు పేడను ఎంతో పవిత్రంగా భావిస్తారు. పేడ‌తో చేసిన గొబ్బెమ్మ‌ల‌ను గౌరీమాత‌గా, గోదాదేవిగా కొలుస్తూ.. పూజిస్తారు.  ప‌సుపు కుంకుమ‌ల‌తో అలంక‌రిస్తారు. గొబ్బెమ్మలు గోపికలను, పూలరేకులు, పసుపు, కుంకుమలు సౌభాగ్యాన్ని సూచిస్తాయి. రంగ‌వ‌ల్లుల మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మను దేవ‌త‌గా భావిస్తారు.

సాధారణంగా గొబ్బెమ్మలను పెళ్లికాని అమ్మాయిలు తయారు చేసి, అలంకరించాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఎందుకంటే గొబ్బెమ్మ‌ల‌ను చేసి.. పూజించ‌టం వ‌ల్ల త్వ‌ర‌గా పెండ్లి అవుతుంద‌ట‌. వ‌చ్చే భ‌ర్త మంచిగా ఉంటాడ‌నీ, భ‌విష్యత్తు సంతోషంగా ఉంటుంద‌ని న‌మ్మ‌కం. పేడ‌తో చేసే గొబ్బెమ్మ‌ల్లో క్రిమీ కీటకాలను నాశనం చేసి, ప్రకృతికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయ‌ని ఆధునిక శాస్త్రం సైతం పేర్కొంటున్న‌ది. ముగ్గులు, గొబ్బెమ్మలు అంటే లక్ష్మీ దేవికి సైతం చాలా ఇష్టమట. అందుకే సంక్రాంతి రోజుల్లో రంగ‌వ‌ల్లుల మ‌ధ్య‌లో గొబ్బెమ్మలను పెడితే ఇంట్లో లక్ష్మీ దేవిని ఆహ్వానించినట్టు అని విశ్వసిస్తుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios