విజయవాడ కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నఎన్టీఆర్ జిల్లా పేరులో కొంత సవరణలు చేయాలని కవి, రచయిత చలపాక ప్రకాష్ కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ ఆయన లేఖ రాశారు.
విజయవాడ (vijayawada) కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ (andrapradhesh) ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నఎన్టీఆర్ జిల్లా పేరులో కొంత సవరణలు చేయాలని కవి, రచయిత చలపాక ప్రకాష్ కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి సూచనలు చేస్తూ ఆయన లేఖ రాశారు. తెలుగు భాషకి, నేలకు, తెలుగు చలనచిత్ర రంగానికి ప్రపంచ ప్రఖ్యాతిని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ (ntr) అని అన్నారు. అలాంటి మహనీయుడి పేరును జిల్లాకు పెట్టడం అభినందనీయం అని అన్నారు. కానీ విజయవాడ పట్టణాన్ని తాకుతూ పారే కృష్ణానది ఈ నగర పరిసర ప్రాంత ప్రజలకు దాహం తీరుస్తోందని అన్నారు. దీంతో ఈ నదికి ఇక్కడి ప్రజలకు విడదీయరాని బంధం ఏర్పడిందని చెప్పారు. అలాగే విజయవాడ ప్రకాశం బ్యారేజికి ఎంతో గొప్ప చారిత్రక కట్టడంగా చరిత్ర ఉందని తెలిపారు. కాబట్టి ఈ జిల్లాకు కృష్ణా (krushna) జిల్లాగానే కొనసాగించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారని రచయిత చలపాక ప్రకాశ్ కోరారు.
అయితే కవి, రచయితగా చిన్న సవరణలతో తాను రెండు ప్రతిపాదనలు చేస్తున్నానని ఆయన తెలిపారు. మచిలీపట్నానికి ఎన్టీఆర్ (ntr district) జిల్లాగా నామకరణ చేయవచ్చని సూచించారు. లేకపోతే విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం తీర్మానించుకుంటే కనీసం ‘ఎన్టీఆర్ కృష్ణాజిల్లా’గా అయినా పేరును కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే జిల్లా పేర్ల ఎంపికలో ప్రభుత్వం ప్రజల విశ్వాసాలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. కాబట్టి ప్రజలు విశ్వాసాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.
ఇదిలా ఉండగా కొత్త జిల్లాలకు పేర్లు సూచిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (mudragada padmanabham) నిన్న సీఎం జగన్ (cm jagan)కు లేఖ రాశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పారు. మరో జిల్లాకు శ్రీకృష్ణ దేవరాయల పేరు పెట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తాను పత్రికల్లో చూశానని చెప్పారు. కొత్త జిల్లాలకు మహానుభావుల పేర్లు పెట్టే అవకాశం పరిశీలించాలని కోరారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి మంగళవారం నాడు ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ (notification) పై ప్రజలు తమ సూచనలు,సలహాలతో పాటు అభిప్రాయాలను తెలపాలని ప్రభుత్వం కోరింది. వచ్చే నెల 26వ తేదీ వరకు ప్రజలకు గడువును ఇచ్చింది. ఉగాది నుండి కొత్త జిల్లాల నుండి పాలన సాగించాలని జగన్ సర్కార్ తలపెట్టింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్ (YS Jagan) హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.. అరకు ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. అరకు పార్లమెంట్ స్థానం నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. దీంతో ఈ ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
