తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్టించడానికి మూడు విగ్రహాలు సిద్ధమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి చెందిన శిలా శిల్ప ఉత్పత్తి విభాగంలో ఈ విగ్రహాలను రూపొందించారు శిల్పులు.

స్థపతి మారుతీరావు ఆధ్వర్యంలో మూడు విగ్రహాలు తయారయ్యాయి. ఇటీవల రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్టించేందుకు రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలను యుద్ధప్రాతిపదికన తయారుచేసి వీటిని ఇవాళ రామతీర్థం తరలించారు.

దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి రామతీర్థంకు శుక్రవారం విగ్రహాల తరలింపు కార్యక్రమం జరిగింది. విగ్రహాల తయారీకి కంచి నుంచి కృష్ణ శిలను తెచ్చిన శిల్పులు 11 రోజుల్లోనే మూడు విగ్రహాలను సిద్ధం చేశారు.

రామయ్య విగ్రహం రెండున్నర అడుగులు, సీతా, లక్ష్మణ విగ్రహాలు రెండు అడుగుల ఎత్తుగా మలిచారు. రామతీర్థం ఆలయంలో ధ్వంసమైన విగ్రహాల నమూనాతోనే కొత్త విగ్రహాల తయారీ జరిగింది.

కాగా, రామతీర్థం విగ్రహాల ధ్వంసం వ్యవహారం దుమారం రేపిన నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త విగ్రహాలను ప్రతిష్టించేందుకు ఏర్పాట్లను చకచకా పూర్తి చేసింది.