ఓటీఎస్ పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదల నుంచి డబ్బులు వసూలు చేయాలని చూస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీపై విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో పేదల నుంచి వేల కోట్ల వసూళ్ల కు పాల్పడుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన టీడీపీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. పేదల నుంచి పల్లెల్లో పది వేలు, పట్టణాల్లో పదిహేనువేలు, నగరాల్లో ఇరవై వేల చొప్పన వసూళ్లు చేయాలని చూస్తోందని ఆరోపించారు. పేపర్లలో ఇష్టముంటే కట్టొచ్చని లేకపోతే లేదని చెపుతున్నారని తెలిపారు. కానీ ఖచ్చితంగా చేయాల్సిన కార్యక్రమంగా దీనిని చేర్చారని అన్నారు. అయినా ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్లు చెల్లవని తెలిపారు.
ఇరవై ఏళ్ల కిందట నెల్లూరులో తుఫాన్ వచ్చిందని తెలిపారు. ఆ తుఫానుల వల్ల పేదల ఇళ్లన్నీ కొట్టుకుపోయాయని గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో సీఎంగా ఉన్న మర్రి చెన్నారెడ్డి రూ.4 వేలతో గోడలు నిర్మించి, తాటాకు కప్పులు వేశారని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు వచ్చినప్పుడు రేకులు వేశారని గుర్తు చేశారు. కొంత కాలం తరువాత ఎన్టీఆర్ సీఎం అయిన తరువాత దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా పక్కా ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కేంద్ర మంత్రులు హెలిక్యాప్టర్లలో వెళ్తున్న సమయంలో స్లాబ్ వేసిన ఇళ్లు ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్ అని గుర్తించే విధంగా చేశారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే గృహనిర్మాణ పథకం కోసం జేసీ స్థాయిలో ఉండే ఐఏఎస్ ఆఫీసరర్ ను నియమించారని, దీంతో తాము పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపడుతున్నారని భావించామని అన్నారు. 1908లో వచ్చిన రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం నిషేధంలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను పంచాయతీ సెక్రటరీకి అప్పగించారని అన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కు చెందిన చట్టం కాదని తెలిపారు. దేశంలో ఎక్కడ భూములు క్రయ విక్రయాలు జరిగినా.. సబ్ రిజిస్గ్రార్ ఆఫీస్ లో మాత్రమే రిజిస్ట్రేషన్ జరగాలని అన్నారు. కానీ ఈ అధికారాలను పంచాయతీ సెక్రటరీలకు బదలాయించి వారితో డబ్బులు వసూళ్లు చేయిస్తున్నారని ఆరోపించారు.
ఓటీఎస్ పేరుతో ఏపీ ప్రభుత్వం ఇస్తున్న పత్రాలకు చట్టబద్దత లేదని అన్నారు. ఇలా చెల్లని పత్రాలకు పేద వారి నుంచి డబ్బులు వసూళు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి పనులకు ఒడిగట్టలేదని అన్నారు. అసైన్డ్ భూములను 50 ఏళ్ల నుంచి వారసులు అనుభవిస్తున్నారని తెలిపారు. వీటిపై అప్పులున్నా ఎవరూ వసూలు చేయలేదని అన్నారు. ఇందిరమ్మ, ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్లకు జగనన్న హక్కుపత్రం అంటూ కాగితాలు ఇస్తున్నారని అన్నారు. 50 ఏళ్ల నుంచి అందులోనే ఉంటున్న పేద వారికి.. 10 ఏళ్ల తరువాత హక్కు కల్పిస్తామని చెప్పడం ఏంటని తెలిపారు. కొందరు కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే భూముల్లో, పోరంబోకు, దేవాదాయ భూముల్లో ఇళ్లు కట్టుకొని జీవిస్తున్నారని.. ఇప్పుడు ఈ పత్రాలు రావడం వల్ల వాటిని అమ్ముకోవచ్చా అని ప్రశ్నించారు. ఈ పత్రాలు ఉండటం ద్వారా జరిగిన ఈ అమ్మకాలు ఎలా చెల్లుబాటు అవుతాయని అన్నారు.
