అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద కార్యకర్తలు హల్ చల్ చేశారు. హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబును పలువురు టీడీపీ కార్యకర్తలు కలిశారు. 

రాబోయే ఎన్నికల్లో మళ్లీ సీఎం చంద్రబాబు నాయుడే కావాలని వారంతా కోరారు. పోరాటం ఆపొద్దని ఏపీ అభివృద్ధి చెందాలంటే మళ్లీ మీరు సీఎం కావాలి సార్ అంటూ కోరారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన 4ఏళ్ల బాలుడు భానుశేఖర్ చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

నేను పెద్దయ్యేసరికి ఏపి నెంబర్ వన్ కావాలి, నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఏం చేస్తావో నాకు తెలియదు అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. భానుశేఖర్ మాటలకు అంతా అబ్బురపడ్డారు. మరోవైపు 
గన్నవరం నియోజకవర్గానికి చెందిన వృద్దురాలు సీతారావమ్మ చంద్రబాబును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. 

మా అందరికీ నువ్వే అండగా ఉండాలయ్యా..ఏదో మోసం జరిగిందయ్యా అంటూ చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 
తిరుపతి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం, కృష్ణా జిల్లా ఉయ్యూరు, గన్నవరం, కైకలూరు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

వారితోపాటు తుడా ఛైర్మన్ తుగ్గలి నరసింహులు, వడ్డెర కార్పోరేషన్ ఛైర్మన్ దేవెళ్ల మురళి, కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్మన్ గద్దె అనూరాధ తదితరుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున వచ్చారు.
చంద్రబాబును కలిసినవారిలో మాజీ ఎంపి మాగంటి బాబు, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, జవహర్, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్మ, సుగుణమ్మ, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్, బీద రవిచంద్ర యాదవ్ లు కలిశారు.