విజయవాడ: హిందూ ధార్మిక సంస్థలు, బీజేపీ చలో శ్రీశైలం కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. శ్రీశైలంలో అన్యమతస్థుల ఆధిపత్యం అధికంగా ఉందని ఆరోపిస్తూ హిందూ ధార్మిక సంస్థలు ఈనెల 20న చలో శ్రీశైలంకు పిలుపునిచ్చాయి. 

శ్రీశైలం వద్ద ఎలాంటి ఆందోళనలను, ప్రదర్శనలకు అనుమతిలేకపోవడంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. చలో శ్రీశైలం కార్యక్రమానికి వెళ్లకుండా పలు చోట్ల ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. అందులో భాగంగా తాళ్లాయిపాలెం పీఠాధిపతి శివస్వామిని బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 శ్రీశైలం దేవాలయం పరిసర ప్రాంతాల్లో అన్యమతస్తుల ఆధిపత్యం పెరిగిపోయిందని అక్కడ ఉండే దుకాణాల వారు సైతం అన్యమతస్థులేనని బీజేపీ, హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి. 

ఇలా అయితే భవిష్యత్ లో శ్రీశైలం వద్ద హిందూ మతానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఆందోళనల నేపథ్యంలో శ్రీశైలంలో పోలీసులు సెక్షన్ 30ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం ఆలయం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు.