కరోనా నేపథ్యంలో ఏపీ సరిహద్దు గ్రామ ప్రజలతో ఒడిశా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. వైరస్ పేరుతో సరిహద్దు గ్రామాల ప్రజలకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. శ్రీకాకుళం-ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలను తమ రాష్ట్రంలోకి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఏపీలో అంత భయంకరమైన వేరియంట్ ఏదీ లేదని అధికారులు చెబుతున్నా... ఇతర రాష్ట్రాలు నమ్మడం లేదు. ముఖ్యంగా ఒడిశా ప్రభుత్వం మాత్రం ఏపీపై కఠిన ఆంక్షలను విధిస్తూ వెళ్తోంది. దీంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒడిశా నుంచి ఎవరూ రాకుండా బోర్డర్ క్లోజ్ చేసేశారు ఏపీ పోలీసులు. ఇచ్ఛాపురం చెక్ పోస్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం అత్యవసర సర్వీసులు,  మెడికల్ వాహనాలకు మాత్రమే మినహాయింపులు ఇస్తున్నారు.

Also Read:అత్యవసర ప్రయాణాలకు ఈ-పాస్... హద్దు మీరితే వాహనాలు జప్తే: ఏపీ డీజీపీ సవాంగ్

ఇది ఇలా ఉండగా.. ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో ఒడిశా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో ఆంధ్రా ప్రాంతం నుంచి రాకపోకలను అడ్డుకునేందుకు రోడ్డును బుల్డోజర్లతో తవ్వేశారు అక్కడి అధికారులు.

శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలం నుంచి ఒడిశాలోకి ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఒడిశా గ్రామాలైన భిన్నాల, బడగాం , అగర్ఖండి గ్రామాల సరిహద్దు రహదారులను తవ్వేసారు . అయితే ఒడిశా అధికారుల తీరుపై మండిపడుతున్నారు సరిహద్దు ఏపీ గ్రామ ప్రజలు.