విజయవాడలో ఉద్రిక్తత... సీఎం ఇంటి ముట్టడికి టిడిపి శ్రేణుల ప్రయత్నం
టిడిపి నేత కొమ్మారెడ్డి పట్టాభిపై జరిగిన దాడికి నిరసనగా పెద్దసంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరడానికి సిద్దమవడంతో ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడ: టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పట్టాభిరాంపై పట్టపగలే జరిగిన దాడికి నిరసిసనగా టిడిపి శ్రేణులు సీఎం జగన్ ఇంటి ముట్టడికి సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే పట్టాభి ఇంటి నుంచి పెద్దసంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు బయలుదేరడానికి సిద్దమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వాగ్విదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇక పట్టాభిరామ్ పై దాడిని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. 15మంది చుట్టుముట్టి ఇనుపరాడ్లతో, బండరాళ్లతో కారు ధ్వంసం చేయడం, పట్టాభిని గాయపర్చడంపై చంద్రబాబు మండిపడ్డారు.
పట్టాభిరాంపై దాడి జరిగినట్లు తెలుసుకున్న వెంటనే ఆయనను పరామర్శించడానికి చంద్రబాబు విజయవాడకు బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పట్టాభి ఇంటికి చేరుకున్నారు. గాయపడిని పట్టాభిని పరామర్శించిన చంద్రబాబు రాళ్లదాడిలో ధ్వంసమైన కారును పరిశీలించారు. ఈ దాడికి సంబంధించిన వివరాలను పట్టాభిని అడిగి తెలుసుకున్నారు.
read more దాడికి వారం ముందు నుండే ప్లాన్.. బోడెప్రసాద్ పై కూడా.. : పట్టాభి సతీమణి
''విజయవాడలో పట్టపగలు పట్టాభిపై దాడి చేయడం వైసిపి గుండారాజ్ కు ప్రత్యక్ష సాక్ష్యం. సిఎం జగన్ రెడ్డి అండతోనే వైసిపి గుండాలు రెచ్చిపోతున్నారు. ఇంటినుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తున్న పట్టాభిపై దాడి గర్హనీయం. సెల్ ఫోన్ తో సహా పట్టాభి కారును ధ్వంసం చేయడం హేయం. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి పట్టాభిపై దాడి మరో సాక్ష్యం'' అన్నారు చంద్రబాబు.
''గతంలో పట్టాభి కారు ధ్వంసం చేసినవాళ్లపై చర్యలు లేవు. పోలీసుల ఉదాసీనతతో వైసిపి గుండాల దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయి. పట్టాభిపై దాడిచేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. పట్టాభికి పూర్తి భద్రత కల్పించాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.