కొమ్మాలపాటి, నంబూరి మధ్య సవాళ్లు: అమరావతిలో టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ,టెన్షన్ (వీడియో)
అమరావతిలో ఇవాళ టెన్షన్ చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్లు , ప్రతి సవాళ్లు ఉద్రిక్తతకు కారణమయ్యాయి. టీడీపీ , వైసీపీ శ్రేణులను నిలువరించేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది.
అమరావతి: అమరావతిలో ఆదివారంనాడు టెన్షన్ చోటు చేసుకుంది. అమరావతి అమరలింగేశ్వర ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లాలోని పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు , నియోజకవర్గ అభివృద్దిపై అమరావతి అమరేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇసుక తవ్వకాల్లో అవినీతిపై మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చేసిన సవాల్ కు ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు స్పందించారు. బహిరంగ చర్చకు తాను సిద్దమని నంబూరు శంకర్ రావు ఇవాళ వీడియోను విడుదల చేశారు.
ఈ చర్చ లో పాల్గొనేందుకు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అమరేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. అదే సమయంలో అమరేశ్వర ఆలయానికి చేరుకునేందుకు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు వచ్చారు. .ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ సహా టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. . కొమ్మాలపాటి శ్రీధర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో టీడీపీ శ్రేణులు పోలీస్ వ్యాన్ ను ధ్వంసం చేశారు. ఈ సమయంలో పోలీసులు టీడీపీ శ్రేణులపై లాఠీచార్జీ చేశారు. మరో వైపు ఈ చర్చలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే శంకర్ రావు కు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చారు. ఎమ్మెల్యే శంకర్ రావు కు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ శ్రేణులను కూడా అమరావతి నుండి వెనక్కి వెళ్లిపోవాలని కోరాలని ఎమ్మెల్యేను పోలీసులు రిక్వెస్ట్ చేశారు.