తాడిపత్రిలో భిక్షాటనకు జేసీ యత్నం: అడ్డుకున్న పోలీసులు, బైఠాయించిన ప్రభాకర్ రెడ్డి
మున్సిపల్ వాహనాల రిపేర్ల కోసం ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయాలని కోరుతూ తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై భిక్షాటనకు వెళ్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
అనంతపురం:తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బిక్షాటనకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన నివాసం వద్దే బుధవారంనాడు జేసీ ప్రభాకర్ రెడ్డి బైఠాయించి నిరసనకు దిగారు.పోలీసుల తీరును జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుబట్టారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మున్సిపాలిటీలో వాహనాల మరమ్మత్తులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని టీడీపీ ఆరోపిస్తుంది. దీంతో వాహనాల మరమ్మత్తులకు అవసరమైన నిధుల కోసం భిక్షాటన చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే తాడిపత్రిలో భిక్షాటనకు జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్తే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసనకు అనుమతి లేదని పోలీసుల జేసీ ప్రభాకర్ రెడ్డిని నిలువరించారు. దీంతో అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. మున్సిపల్ వాహనాలకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రెండు రోజుల్లో నిధులు సమకూర్చకపోతే తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద గాంధీ తరహలోనే తాను నిరసనకు దిగుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. తాడిపత్రి ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించారన్నారు. కానీ తాడిపత్రిని అభివృద్ది కోసం తాము పనిచేస్తుంటే నిధులివ్వకుండడా ప్రభుత్వం మొండిచేయి చూపుతుందని ఆయన విమర్శించారు.