అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు రెడీ అవుతుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. తెలుగు జాతి అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయ్యాలని ప్రణాళిక రచిస్తోంది ఆపార్టీ నాయకత్వం. 

జాతీయ స్థాయిలో రాజకీయాలు చెయ్యడంలో చంద్రబాబు దిట్ట అని చెప్పుకోవచ్చు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కానీ ఎన్డీఏ వన్ ఏర్పాటులో కానీ చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ప్రస్తుతం కూడా జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ కు పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చెయ్యడం లేదని ఆరోపిస్తూ కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 

అవిశ్వాస తీర్మానం సందర్భంలో ఇతర జాతీయ పార్టీల మద్దతు కూడగట్టుకున్నారు. అలా ఇతర పార్టీలతో సత్సమ సంబంధాలు నెరిపిన చంద్రబాబు నాయుడు తెలుగుప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ టీడీపీ పోటీ చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. 

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా, ఢిల్లీ, అండమాన్ నికోబార్ వంటి రాష్ట్రాల్లో పోటీ చెయ్యాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎంపీ స్థానాలకు పోటీ చెయ్యాలని భావిస్తోంది. 

దేశవ్యాప్తంగా 45 పార్లమెంట్ స్థానాలకు పోటీ చెయ్యాలని తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వం ప్లాన్ వేస్తోంది. తమిళనాడులో తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రాప్రాంతానికి చెందిన వారు కోటి 40 లక్షల మంది ఉన్నారని ఆ పార్టీ అంచనా వేస్తోంది. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా కోటిమంది వరకు ఉన్నారని టీడీపీ అధికారికంగా చెప్తోంది.  

ఈ నేపథ్యంలో తెలుగు ప్రజల ఓట్లను చేజిక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. తమిళనాడులో 5 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. 

ఇకపోతే సరిహద్దు రాష్ట్రంగా ఉన్న కర్ణాటకలో సైతం తెలుగు ప్రజలు 40 లక్షల మంది వరకు ఉన్నట్లు టీడీపీ అంచనా వేసింది. అందువల్ల కర్ణాటకలో 3 పార్లమెంట్ స్థానాలకు పోటీ చెయ్యాలని భావిస్తోంది. 

ఇక మరో సరిహద్దు రాష్ట్రం ఒడిస్సాలో కూడా పాగా వెయ్యాలని భావిస్తోంది. ఒడిస్సాలో 30 లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారని గుర్తించిన టీడీపీ ఆ రాష్ట్రంలో రెండు సీట్లలో పోటీ చెయ్యాలని భావిస్తోంది. 

ఇకపోతే ఢిల్లీలో 30 లక్షల మందికి పైగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారని అక్కడ కూడా ఒక పార్లమెంట్ స్థానానికి పోటీ చెయ్యాలని  వ్యూహాలు రచిస్తోంది. ఇకపోతే అండమాన్ నికోబార్ లో లక్షమంది తెలుగువారు ఉన్నారని అక్కడ కూడా ఒక పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో పడింది టీడీపీ. 

ఒకవేళ జాతీయ స్థాయిలో బరిలోకి దిగితే 45 పార్లమెంట్ స్థానాలకు పోటీ చెయ్యాల్సిందేనని టీడీపీ భావిస్తోంది. 45 మంది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో 23 మంది ఎంపీలతోనే చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు 45 మంది పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని ప్రధాని మంత్రిని నిర్ణయించే స్థాయికి చేరుకోవాలని ఆలోచిస్తున్నారు.

ఆయా రాష్ట్రాలలో పోటీ చేస్తే ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవాలో అన్న అంశాలపై కూడా వేగంగా చర్చిస్తోంది నాయకత్వం. తమిళనాడులో డీఎంకే పార్టీతోనూ, కర్ణాటకలో జేడీయూ(ఎస్)తో, ఒడిస్సాలో అయితే బీజేడీతోనూ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చెయ్యాలని ప్రణాళికలు రచిస్తోంది తెలుగుదేశం పార్టీ. 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరిగిందని ఆ అన్యాయాన్ని భర్తీ చేసుకోవాలంటే జాతీయ స్థాయిలో చక్రం తిప్పాల్సిందేనని తీర్మానించుకుంది. అలాగే 45 మంది పార్లమెంట్ సభ్యులతో కేంద్రాన్ని తన చెప్పుచేతుల్లో పెట్టుకోవచ్చునని అప్పుడు రాష్ట్రానికి అన్నీ సాధించుకోవచ్చునని భావిస్తోంది. మరి టీడీపీ ఆలోచనలు ఏ మేరకు  ఫలిస్తాయో వేచి చూడాలి.