నిరుద్యోగులకు మద్దతుగా జాబ్ క్యాలెండర్ ఏమయ్యిందని జగన్ సర్కార్ ను ప్రశ్నిస్తూ విజయవాడలో తెలుగు యువత ఆందోళనకు దిగింది. 

విజయవాడ : ప్రతీ సంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదలచేస్తామన్న హామీ ఏమయ్యిందంటూ జగన్ సర్కార్ ను తెలుగు యువత నాయకులు ప్రశ్నించారు. యువతను మోసపూరిత హామీలతో నమ్మించి వైఎస్ జగన్ గద్దెనెక్కారని... ఇప్పుడు అదే నిరుద్యోగుల పాలిట శాపంగా మారాడని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత నిరాశతో చివరకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏపీలో నెలకొందని తెలుగు యువత నాయకులు ఆందోళన వ్యక్తం చేసారు. 

నిరుద్యోగులకు అండగా తెలుగు యువత ఆధ్వర్యంలో విజయవాడలో వినూత్న నిరసన చేపట్టారు. ఉరితాడుకు మెడలో వేసుకుని, చేతిలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలుగు యువత నాయకులు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే హామీ ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ ఏమయ్యింది? జాబ్ ఎక్కడ జగన్? నాలుగేళ్లు వైసిపి పాలనలో వచ్చిన గ్రూప్ 1,2, డిఎస్సి, పోలీస్ ఉద్యోగాలు ఎన్ని? అంటూ రాసిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలుగు యువత నాయకులు ఆందోళన చేపట్టారు. 

ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ... వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 35వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు పేర్కొన్నారు. రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని... వాటిని భర్తీచేస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన వైసిపి మోసం చేసారన్నారు. ఉద్యోగాలు భర్తీచేయడం అటుంచి ఉన్న ఉద్యోగులను కూడా పీకేస్తున్నారని తెలుగు యువత నాయకులు ఆరోపించారు. 

Read More బాలకృష్ణపై వైసీపీ అస్త్రం.. హిందూపురంలో పార్టీ ఇంచార్జ్‌గా దీపిక.. నియోజకవర్గంలోని గ్రూపులు సహకరిస్తాయా?

నిరుద్యోగ యువత మరోసారి వైసిపి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని... జాబ్ రావాలంటూ సైకో పోవాలి, బాబు రావాలి అని అన్నారు.రాజకీయంగానే కాదు పాలనలో ఎంతో అనుభవం వున్నచంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. కాబట్టి యువత అప్రమత్తంగా వుండి వైసిపిని గద్దె దింపి టిడిపిని గెలిపించాలని తెలుగు యువత నాయకులు కోరారు.