అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారి మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఏపీ సీఎం వైయస్ జగన్ దంపతులను కలిశారు. గురువారం ఉదయం తనకు కాబోయే వరుడితో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్ ను కలిశారు. 

సీఎం వైయస్ జగన్ దంపతులకు కాబోయే దంపతులు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెలలో హైదరాబాద్ లో వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో విహానికి హాజరై తమను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. 

ఇకపోతే మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలియనివారు ఉండరు. యువ ఐపీఎస్ అధికారిణిగా మెదక్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆమె తన పనితీరుతో అందర్నీ ఆకర్షించింది. 

తన పనితీరుతోనే కాకుండా తన అందంతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా పలు సందేశాలు ఇస్తూ యువతతో ప్రత్యేకంగా ఇంట్రాక్ట్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు చందన దీప్తి. 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువుతో ఐపీఎస్ చందన దీప్తి వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. వరుడు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఇటీవలే రాష్ట్రానికి వచ్చాడు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనస్ట్రక్షన్ మరియు హాస్పిటాలిటీ రంగంలో స్థిరపడనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరిదీ లవ్ మ్యారేజ్ అని తెలుస్తోంది. 

ఇకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం ఇటీవలే కలిశారు ఎస్పీ చందన దీప్తి. ఈనెలలో జరిగే తన వివాహానికి హాజరై తమను ఆశీర్వదించాలని కోరారు. ఇకపోతే చందన దీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.