అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ నెల 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఏపీ సీఎం జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో సోమవారం నాడు విజయవాడకు వెళ్లారు. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఇవాళ మధ్యాహ్నం 1:45 గంటలకు విజయవాడ చేరుకొన్న కేసీఆర్ కనకదుర్గ అమ్మవారిని  దర్శించుకొన్నారు. కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత  కేసీఆర్ నేరుగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నివాసానికి చేరుకొన్నారు. ఏపీ సీఎం‌ జగన్ నివాసంలో  కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేస్తారు. భోజనం తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై చర్చించనున్నారు.సాయంత్రం విజయవాడలో స్వరూపానంద స్వామి నిర్వహించే సరస్వతి పూజలో  కేసీఆర్ పాల్గొంటారు. ఆ తర్వాత కేసీఆర్ హైద్రాబాద్ చేరుకొంటారు.