హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని అభినందించారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇతర మతస్థులు ఉద్యోగాలు చేస్తే వారిని తొలగించాలంటూ జగన్ ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు. 

హిందూ దేవాలయాలలో హిందువలు మాత్రమే ఉద్యోగాలు చేయాలి.  తిరుమలలో హిందువులు కానివారు ఎవరైనా ఉంటే తక్షణమే విధుల నుంచి తొలగించాలంటూ సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాజాసింగ్ ట్వీట్ చేశారు. 

తిరుపతిలో సనాతన హిందూ ధర్మం రక్షించేందుకు ఇది తొలి అడుగుగా తాను భావిస్తున్నట్లు రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు జగన్ ఆదేశాలపై ఒక జాతీయ ఛానెల్ లో జరుగుతున్న డిబేట్ ఫోటోను ట్యాగ్ చేశారు రాజాసింగ్. 

ఇకపోతే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హిందూ వ్యతిరేకి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేశాయి. అమెరికాలో ఓ కార్యక్రమం ప్రారంభోత్సవంలో జగన్ జ్యోతిప్రజ్వలన చేయకుండా హిందువుల మనోభవాలు దెబ్బతీశారంటూ బీజేపీ నేతలు కొందరు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 

జగన్ హిందూ వ్యతిరేకి అంటూ ప్రచారం జరిగిన వారం రోజుల వ్యవధిలోనే జగన్ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు మెుదటి అడుగు వేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందించడం విశేషం. రాజాసింగ్ అభినందనలపై వైసీపీ సోషల్ మీడియా హర్షం వ్యక్తం చేస్తోంది.