Asianet News TeluguAsianet News Telugu

మైనర్ ను ఇంట్లోంచి ఎత్తుకెళ్లిన యువకులు... బాలిక తండ్రి చూసేసరికి...

మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించడమే కాదు కిడ్నాప్ కు యత్నించాడు ఓ గుంటూరు యువకుడు. స్నేహితుల సాయంతో బాలికను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి చివరకు కటకటాల పాలయ్యాడు.  

Teens planned to kidnap minor girl in guntur district
Author
Guntur, First Published Sep 8, 2021, 1:16 PM IST

గుంటూరు: మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించడమే కాదు కిడ్నాప్ కు యత్నించాడు ఓ యువకుడు. అర్ధరాత్రి మైనర్ ను ఇంట్లోంచి బయటకు రప్పించి కిడ్నాప్ చేసి తీసుకుని వెళుతుండగా ఆమె తండ్రి గమనించాడు. దీంతో అతడు దుండగులను వెంబడించి కూతురిని కాపాడుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.   

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే అదే గ్రామానికి చెంది చుక్కా నవీన్ అనే యువకుడు బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో బాలికను నిత్యం వేధించేవాడు. ఎలాగో బాలిక ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ కాల్, మెసేజ్ లు చేస్తూ వేధించసాగాడు.  

read more  ‘నన్ను పెళ్లి చేసుకో.. లేదంటే చంపేస్తా...’ వివాహితకు యూ ట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి బ్లాక్ మెయిల్..

ఈ మధ్యకాలంలో అతడి చేష్టలు మరింత ఎక్కువయి బాలికను కిడ్నాప్ చేసే స్థాయికి చేరుకున్నాయి. గత ఆదివారం రాత్రి బాలికను ఇంటి బయటకు రమ్మని మెసేజ్ చేశాడు. దీంతో బాలిక ఇంటి బయటకు రాగానే నవీన్ తో పాటు అతడి స్నేహితుల గోపాలరావు. పెదరాయుడు ఆమెను కిడ్నాప్ చేశారు. బలవంతంగా బాలికను బైక్ పై ఎక్కించుకుని తీసుకుని వెళుతుండగా భయపడిపోయిన యువతి కేకలు వేసింది. దీంతో బాలిక తండ్రి పాలడుగు శ్యాం ప్రసాద్ కూతురిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నట్లు గుర్తించాడు. 

దీంతో వెంటనే అతడు కిడ్నాపర్లను వెంబడించగా బాలికను వదిలిపెట్టి వారు పరారయ్యారు. తనను కిడ్నాప్ చేయడానికి యత్నించిన యువకులను బాలిక గుర్తించింది. దీంతో సోమవారం ఉదయమే పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాలిక తండ్రి యువకులపై ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ తో పాటు అతడి స్నేహితులపై పోక్సోతో పాటు కిడ్నాప్ కేసులు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.  కిడ్నాప్ కి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనపరచుకొని ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించారు. మరో యువకుడు పరారీలో వున్నాడని...అతడి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై వెంకటాద్రి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios