అన్నమయ్య జిల్లాలో విషాదం: సంపతికోట వద్ద వాగులో కొట్టుకుపోయిన కారు, ఒకరు మృతి
అన్నమయ్య జిల్లాలోని సంపతికోట వద్ద వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకరు మరణించారు. మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. కళ్ల ముందే కూతురు మరణించడంతో పేరేంట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
రాజంపేట: అన్నమయ్య జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలం సంపతికోట వద్ద వాగులో కారు కొట్టుకుపోయింది.ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ముగ్గురు ఈ ప్రమాదం నుండి సురక్షితంగా తప్పించుకున్నారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలో వరద ప్రవాహనికి కారు కొట్టుకుపోయిన ఘటనలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే మౌనిక మృతి చెందింది.
ఇదే జిల్లాకు చెందిన తురకలపల్లికి చెందిన రమణ కుటుంబం కారులో బెంగుళూరు కు వెళ్లింది. రమణ ఆయన భార్య ఉమాదేవి, రమణ కకూతురు మౌనిక రమణ కారు డ్రైవర్ శ్రీనివాస్ లు కారులో ఉన్నారు. రమణ కూతురు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇటీవలనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ లో చేరింది.
బెంగుళూరులో ఆమె విధులు నిర్వహిస్తుంది. బెంగుళూరులో పని ముగించుకొని రమణ కుటుంబం శనివారం నాడు రాత్రి స్వగ్రామానికి తిరిగి బయలుదేరింది. అయితే వీరు ప్రయాణం చేస్తున్న కారు సంపతికోట వద్ద వాగులో కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన వాగు వద్దకు చేరుకున్నారు. వాగులో కొట్టుకుపోతున్న కారులో నుండి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. కారులో ఉన్న యువతి మౌనిక కారులోనే మృతి చెందింది. రమణ స్థానికంగా ప్రైవేట్ స్కూల్ ను నడుపుతున్నాడు.