విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే గాడి తప్పాడు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి సహజీవనం చేశాడు. తీరా బాలిక ఇంట్లో ఈ విషయం తెలియడంతో... వారి ఇద్దరికీ వివాహం చేశారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని దాలిపాడు గ్రామ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో అతను ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. అతనికి గతంలోనే వివాహం జరగగా... అది ఎవరికీ చెప్పకుండా పాఠశాలలో చదివే బాలికతో ప్రేమాయణం నడిపాడు.

బాలికకు మాయమాటలు చెప్పి.. ఆమెతో సహజీవనం చేశాడు. బాలిక తల్లిదండ్రులకు తెలిసి గొడవ చేయడంతో... పెళ్లి చేసుకున్నాడు. అయితే... తనకు ఇది వరకు పెళ్లి అయ్యిందని... ఇద్దరినీ బాగా చూసుకుంటానని నోట్ రాసి ఇవ్వడం గమనార్హం. 

ఈ విషయంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణను వివరణ కోరగా.. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు వారం రోజుల కిందట వచ్చి, తమ బిడ్డకు టీసీ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి తీసుకుపోయారన్నారు. అంతకుమించి తమకు ఏమీ తెలియదని చెప్పారు. ఉపాధ్యాయుడి వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు