కర్నూలు: ఆధునిక యుగంలో మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఉపాధ్యాయులు కాలనాగై విద్యార్థులను కాటేస్తున్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సింది పోయి తామే వక్రమార్గంలో నడుస్తున్నారు. 

తాజాగా ఓ ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధిస్తున్నాడు. ఆమె తిరస్కరించడంతో తప్పతాగి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేసి చంపబోయాడు. గురువు అనే పదానికి కలంకం తీసుకువచ్చాడు. ఈ దారుణమైన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా బంగారుపేటకు చెందిన ఓ విద్యార్థిని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. అదే పాఠశాలలో శంకర్ అనే వ్యక్తి హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ఆ విద్యార్థినిని శంకర్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ప్రేమించాలంటూ ఒత్తిడి పెంచుతున్నాడు. 

ఉపాధ్యాయుడు వేధింపులు భరించలేక ఆ విద్యార్థిని చదువు మద్యలోనే ఆపేద్దామని ప్రయత్నించింది. అయితే కుటుంబ సభ్యులు నిలదీసే సరికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తోంది. కుటుంబ సభ్యులకు తెలిస్తే ఎలాంటి గొడవలు జరుగుతాయో అన్న భయంతో విద్యార్థిని ఎవరికీ చెప్పకుండా గురువు పెట్టే బాధను భరిస్తూనే ఉంది. 

అయితే శనివారం ఉదయం ఫూటుగా తాగిన శంకర్ ఆ విద్యార్థిని ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు లేకపోవడంతో కత్తితో దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించి గట్టిగా అరవడంతో స్థానికులు పరుగున వచ్చారు. అప్పటికే ఆమె రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. స్థానికులు రావడంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయుడు తాను గొంతు కోసి ఆత్మహత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించాడు. 

అయినా ఆగని ప్రజలు అతన్ని పట్టుకుని కరెంట్ స్థంభానికి కట్టేసి బడితపూజ చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయుడి చేతిలో తీవ్రగాయాలపాలైన విద్యార్థినిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆత్మహత్యాయత్నం చేసిన శంకర్ కూడా అదే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.