Asianet News TeluguAsianet News Telugu

‘‘ నిజం గెలవాలి ’’.. జనంలోకి నారా భువనేశ్వరి, భద్రత కల్పించండి : డీజీపీకి టీడీపీ లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’  పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి భద్రత కల్పించాల్సిందిగా డీజీపీని టీడీపీ కోరింది.

tdp wrote letter to ap dgp rajendranath reddy for providing security to nara bhuvaneswari event ksp
Author
First Published Oct 21, 2023, 10:02 PM IST

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ లేఖ రాసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’  పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి భద్రత కల్పించాల్సిందిగా డీజీపీని టీడీపీ కోరింది. కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మోత మోగిద్దాం, క్రాంతితో కాంతి, న్యాయానికి సంకెళ్లు వంటి వినూత్న నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ నేతలతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో ఆమె ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నారు. 

Also Read: నా తల్లిపై కేసు పెడతామని బెదిరించారు.. ప్రజల కోసమే చంద్రబాబు పోరాటం: లోకేష్ కంటతడి

వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ , తదితర పరిణామాలతో మనస్తాపానికి గురై మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటించనున్నారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ కారణంగా నిలిచిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరిగి ప్రారంభించనున్నారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు లోకేష్ ఈ కార్యక్రమం బాధ్యతలు చూస్తారు. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సమీక్షపై త్వరలోనే విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. 

అంతకుముందు  మంగళగరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో భావోద్వేగానికి లోనైన లోకేష్.. సమావేశ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని ప్రజల కోసం పోరాడారని లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌ల‌వంచ‌డు, త‌ల దించ‌డని అన్నారు. తన తల్లిపై కేసు పెడతామని సీఐడీ బెదిరించిందని లోకేష్ చెప్పారు. తన తల్లి ఐటీ రిటర్న్స్ చూపి కేసు పెడతామని బెదిరించారని అన్నారు. 

తన తల్లి రాజకీయంగా ఏనాడైనా బయటకు వచ్చారా? అని ప్రశ్నించారు. తన తల్లికి సేవా కార్యక్రమాలు తప్ప..రాజకీయాలు తెలియదని అన్నారు. తన తల్లి భువనేశ్వరి, తన భార్య బ్రాహ్మణిలు కలిసి చంద్రబాబు నాయుడును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి, భార్యలు చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భోజనంలో విషం కలపటం, బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్‍ఏ అని విమర్శించారు. 

ప్ర‌జ‌ల త‌ర‌ఫున శాంతియుతంగా పోరాడాల‌ని చంద్రబాబు చెప్పారని లోకేష్ తెలిపారు. త్వ‌ర‌లో భువ‌న‌మ్మ ``నిజం గెల‌వాలి`` కార్య‌క్ర‌మం చేపడతామని చెప్పారు. న‌వంబ‌ర్ 1 నుంచి బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్తుకి గ్యారెంటీ పునః ప్రారంభించనున్నట్టుగా తెలిపారు. చంద్ర‌బాబు క‌డిగిన ముత్యంలా త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కొస్తారని.. అనంత‌రం యువ‌గ‌ళం పాద‌యాత్ర మొద‌ల‌వుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి 160 సీట్లు గెల‌వ‌బోతోందని ధీమా వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios