గుంటూరు : ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బతగిలింది. తెలుగుదేశం పార్టీ వాయిస్ ను బలంగా వినిపించే మహిళా నేత  ఆపార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీలో చేరడంతో తాజాగా ఆపార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. యామిని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. 

ఈ వార్తలకు ఊతమిచ్చేలా ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దాంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.  

ఇకపోతే సాధినేని యామిని తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేవారు. వైయస్ జగన్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. నవరత్నాల్లో ఒక రత్నం పడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సోషల్ మీడియా సాక్షిగా తీవ్ర విమర్శలు సైతం చేశారు. 

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను ఒక అస్త్రంగా వాడుకున్న సాధినేని యామిని వైసీపీపై ధ్వజమెత్తుతూ పోస్టులు పెట్టేవారు. తెలుగుదేశం పార్టీని బలపరచాలంటూ సోషల్ మీడియా సాక్షిగా కాంపైన్ సైతం నిర్వహించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత నెల రోజుల వరకు వైసీపీపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. అయితే కొన్నిరోజులుగా ఆమె మౌనంగా ఉంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో యామిని పార్టీ మారతారంటూ వార్తలు వచ్చాయి. 

తాజాగా కన్నా లక్ష్మీనారాయణతో ఉన్న ఫోటో కాస్త లీక్ అవ్వడంతో ఆమె ఇక తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంపై సాధినేని యామిని గానీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.