తమదే గెలుపు అంటూ వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబులు అరుస్తున్నారని అరిస్తే అలుపొస్తదే తప్ప గెలుపు రాదన్నారు. ప్రజల మనసులు దోచుకుంటేనే గెలుపు సాధ్యమవుతుందని అది వైసీపీకి తెలియదన్నారు. ప్రజల మనసులు టీడీపీ దోచుకుంటే వైసీపీ మాత్రం ప్రజల పొట్ట కొడుతోందంటూ యామిని తిట్టిపోశారు.
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు రాజకీయ పార్టీయేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఉండరు, అవిశ్వాస తీర్మానానికి ముందే రాజీనామాలు చేసేస్తారు.
ప్రకృతి విపత్తులు వచ్చినా కనబడరు అలాంటి పార్టీ ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటేనంటూ ఘాటు వ్యాక్యలు చేశారు. ప్రజల సమస్యల కోసం ఏనాడు వైసీపీ పోరాటం చెయ్యలేదన్నారు.
ప్రజలకు మంచి జరగాలని కోరుకోని వైసీపీ ఎక్కడైనా శవం కనబడితే శవరాజకీయాలు మాత్రం చేస్తారంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు విజయసాయిరెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎంపీ విజయసాయిరెడ్డికి రోజురోజుకు మతిభ్రమిస్తుందంటూ ఎద్దేవా చేశారు.
ఆయన విజయసాయిరెడ్డి కాదని వీసారెడ్డి అంటూ మండిపడ్డారు. మే 23 తర్వాత విజయసాయిరెడ్డి విదేశాలకు పారిపోవడం ఖాయమని సాధినేని యామిని స్పష్టం చేశారు. గాలికి సచివాలయంలో టెంట్ పడితే నానా యాగీ చేస్తున్న విజయసాయిరెడ్డికి హుద్ హుద్ తుఫాన్ కనిపించలేదా? అని నిలదీశారు.
విజయసాయిరెడ్డికి ఆస్పత్రిలో చికిత్స చేయించాలని కోరారు. ఎంతసేపు బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్నదే విజయసాయిరెడ్డి తాపత్రాయం అంటూ విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీపై విషం చిమ్మడమే విజయసాయిరెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారంటూ విరుచుకుపడ్డారు.
తమదే గెలుపు అంటూ వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబులు అరుస్తున్నారని అరిస్తే అలుపొస్తదే తప్ప గెలుపు రాదన్నారు. ప్రజల మనసులు దోచుకుంటేనే గెలుపు సాధ్యమవుతుందని అది వైసీపీకి తెలియదన్నారు.
ప్రజల మనసులు టీడీపీ దోచుకుంటే వైసీపీ మాత్రం ప్రజల పొట్ట కొడుతోందంటూ యామిని తిట్టిపోశారు. తలకిందులుగా తపస్సు చేసినా వైసీపీ అధికారంలోకి రాదన్నారు. ఉపాధి హామీ పథకం అమలు చూసి కేంద్రం ఏపీకి అవార్డులు ఇస్తుంటే అది చూసి ఓర్వలేని వైసీపీ నిధులు రాకుండా చేసిందని ఆరోపించారు.
