అమరావతి: సమాజాన్ని ప్రభావితం చేస్తున్న అంశాల్లో సోషల్ మీడియా ఒకటి. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అన్ని రాజకీయ పార్టీల చూపులు సోషల్ మీడియాపైనే. సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని చేసుకుని గ్రామస్థాయి వరకు తమ ప్రచారాన్ని తీసుకువెళ్లాయి.  

ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా ఒక ఆయుధంగా మారింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందని సీఎం వైయస్  జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. 

సోషల్ మీడియాలో వెనుకంజలో ఉండటం వల్లే తెలుగుదేశం ఓటమికి కారణం అంటూ టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించారు టీడీపీ అధినేత, ఏఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై సోషల్ మీడియా సాక్షిగా పోరాటం చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. 

తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా నారా లోకేష్ ను నియమించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. నారా లోకేష్ కు ఇప్పటికే ఆదేశాలు  జారీ చేశారు. ప్రస్తుతం సమాజంలో ప్రతీ అంశంపై ప్రభావం చూపించే అంశం సోషల్ మీడియా అని దాన్ని బలోపేతం చేయాలని సూచించారు. 

తెలుగుదేశం పార్టీ పోరాటాలను సోషల్ మీడియాలో పొందుపరచాలని, ప్రజల తరపున చేస్తున్న పోరాటాలను సోషల్ మీడియా వేదికగా అందరికీ చేరవేయాలని సూచించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ సోషల్ మీడియాపై ఇకపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.