ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. రాజకీయంగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతలు జంప్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి దూకిన సంగతి తెలిసిందే.

తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ కి ఊహించని షాక్ తగిలింది. ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి.. వైసీపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆయన ఆళ్లగడ్డలో తన అనుచరులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఆయన టీడీపీ ని వీడి వైసీపీలో చేరాలని అనుకుంటున్నట్లు తన అనుచరులతో చెప్పినట్లు  ప్రచారం జరుగుతోంది. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ.. తనకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆయన తన సన్నిహితులతో వాపోయారట. మరో రెండు మూడు రోజుల్లో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.