అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జగన్ వందరోజుల పాలనపై జగన్ మావాడే అంటూ తెగపొగిడేసిన జేసీ దివాకర్ రెడ్డి ఈసారి మాట మార్చారు. ఈసారి విమర్శలు దాడి చేశారు. మోదీ మంత్రదండం కారణంగానే జగన్ అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. 

జగన్ పాలనపై ప్రస్తుతం చేప్పేదేమీ లేదన్నారు. మరో ఆరు నెలలు తర్వాత గానీ ఏమీ చెప్పలేమన్నారు. జగన్ కు అనుభవం లేదని మళ్లీ విమర్శించారు. అంతేకాదు ఆయనకు మంచి చెడు చెప్పేవారు కూడా లేరన్నారు. 

ప్రస్తుతానికి సీఎం జగన్ తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అనే వ్యవహారంతో ముందుకెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ తెగింపే జగన్ కు మంచి చెడు రెండూ తెస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

ఇకపోతే జగన్ 100 రోజులపాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. జగన్100 రోజుల పాలనలో సంచలన నిర్ణయాలతో పాటూ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. 

జగన్‌ను చేయిపట్టి నడిపించేవాడు కావాలన్నారు జేసీ దివాకర్‌రెడ్డి. జగన్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మావాడే.. అంతేకాదు మావాడు చాలా తెలివైనవాడు అంటూ చెప్పుకొచ్చారు. ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూసి లోపాలను సరిదిద్దాలి అంతేగాని నేలకేసి కొట్టొద్దన్నారు. 

రాజధాని ఇక్కడే ఉంటుంది ఎక్కడికీ తరలిపోదనే అభిప్రాయాన్ని జేసీ వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ అడిగితే సలహాలు ఇస్తానన్నారు. ఇక జగన్ పాలనకు వందకు 110 మార్కులు పడాల్సిందేనన్నారు.

ఇటీవలే జగన్ మావాడు, తెలివైన వాడు అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి నెల రోజులు గడవక ముందే జగన్ కు అనుభవం తక్కువ, మోదీ మంత్రదండం వల్లే గెలిచారంటూ వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.