చిత్తూరు: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాస్త జాగ్రత్తపడి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ఇలాంటి సమావేశాలు కూడా పెట్టుకునే అవకాశం ఉండేది కాదన్నారు. 

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా, ప్రజలే ఓట్లు వేస్తారని కొంతమంది నేతలు ఇంట్లో నిద్రపోయారంటూ వ్యాఖ్యానించారు. 

ప్రాంతాల వారీగా, రంగాల వారీగా తాను చేసిన అభివృద్ధి కళ్లకు కనిపిస్తోందన్నారు. కానీ ప్రజాతీర్పు మాత్రం వ్యతిరేకంగా వచ్చిందన్నారు. తనపట్ల ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తున్నారో  అర్థం కావడం లేదన్నారు. గత ఐదేళ్లలో తాను ఎలాంటి తప్పు చేయలేదని కానీ మరీ 23 సీట్లకు పరిమితం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 

కమ్మ ఓట్ల శాతం లేకపోయినా తెలుగుదేశం పార్టీపై కొందరు కుల ముద్రవేసి అసత్య ప్రచారం చేశారని వాపోయారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పులివెందులకు నీళ్లిచ్చి ఆ తర్వాతే కుప్పానికి తీసుకెళ్లానని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.