ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని. ‘‘ అమరావతిని కూల్చేద్దాం... హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం ’’ అనేలా జగన్ వ్యవహరిస్తున్నారని కేశినేని ఆరోపించారు.

ఇప్పటికే ప్రజావేదిక కూల్చేశారని.. విజయవాడ-సింగపూర్ విమాన సర్వీసు రద్దయ్యిందని.. ఇదే సమయంలో కేసీఆర్‌‌తో మాత్రం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారని కేశినేని వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు.

కొద్దిరోజుల క్రితం ప్రజావేదిక కూల్చివేతపైనా నాని సెటైర్లు వేశారు.  ఇంకా నయం... తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది. అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే’ అంటూ నాని సెటైరికల్‌గా ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టారు.