ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం మాత్రమే తనకు తెలుసని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ... కలకలం రేపుతున్న కేశినేని నాని... తాజాగా మరో పోస్టు పెట్టారు. మొన్నటికి మొన్న దేవినేని ఉమా, కొడాలి నానికి మధ్య  చిచ్చు పెట్టేలా పోస్టు పెట్టిన నాని... ఇప్పుడు... తన వ్యక్తిత్వాన్ని గురించి వివరిస్తూ ఓ పోస్టు పెట్టారు.

‘‘నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్ధమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమనే మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమనే మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం మాత్రమే తెలిసిన వాడిని. నిండు షభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం పెట్టిన వాడిని నేను. నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నా రక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు.’’ అని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

అయితే... దేనిని ఉద్దేశించి కేశినేని నాని ఈ పోస్టు పెట్టారో అర్థం కావడం లేదు.