గుంటూరు: కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త నాటకానికి తెరతీశారని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. కేంద్ర హోంశాఖకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖలో ఫోర్జరీ సంతకాలు ఉన్నాయని విజయసాయి అసత్యాలు చెబుతున్నారని  మండిపడ్డారు.  

నిమ్మగడ్డ లేఖపై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారని... ఇందులో టీడీపీ ఆఫీస్ తో పాటు వర్ల రామయ్య, టీడీ జనార్ధన్ , తన పేరును ప్రస్తావించారని తెలిపారు. అయితే ఆ లేఖతో తమకు ఎలాంటి సంబంధం లేదని... ఆ డ్రాఫ్టింగ్ తనది కాదని అన్నారు. 

ఇండియన్ పీనల్ కోడ్ కింద విజయ సాయి నేరం చేశారని...డిజిపికి చేసిన ఫిర్యాదు దురుద్దేశంతో కూడుకున్నదని అన్నారు. దీని వల్ల  తన గౌరవానికి భంగం కలిగించారని... ప్రజాప్రతినిధినయిన తనను అప్రదిష్టపాలు చేసేందుకే విజయసాయి ఇలా చేశారని పేర్కొన్నారు. చట్టప్రకారం విజయసాయి నేరం చేశారని అన్నారు. 

పలానా వాళ్లు లేఖ రాశారని ఎలాంటి ఆధారాలు లేకుండానే విజయసాయి ఒక నిర్ణయానికి ఎలా వస్తారు?అని ప్రశ్నించారు. విజయసాయి ఫిర్యాదులో భిన్నమైన ఆరోపణలు ఉన్నాయని...  ఫిర్యాదు వెనుక విజయసాయి మాత్రమే ఉన్నారా మరెవరైనా ఉన్నారా అన్నది పరిశీలిస్తామన్నారు. విజయసాయి రెడ్డి వెంటనే తన ఫిర్యాదును ఉపసంహరించుకోకపోతే చట్టపరంగా ముందుకెళ్తామని... ఆయనపై సివిల్, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని కనకమేడల హెచ్చరించారు.