ఢిల్లీ: వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై సెటైర్లు వేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. దాడి కేసులో ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదా అని ప్రశ్నించారు. విచారణకు ఆప్ఘానిస్థాన్ పోలీసులను అయితే నమ్ముతావా అంటూ జేసీ ఎద్దేవా చేశారు. 

జగన్ కు తాలిబన్లపై నమ్మకం ఎక్కువ అని దుయ్యబుట్టారు. తాలిబన్ల చేత విచారణ చేయిస్తేనే నమ్మకం ఉంటుందంటూ చురకలు అంటించారు. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు దేశంలోని పోలీసుల వ్యవస్థపైనా నమ్మకం లేదంటూ ఆరోపించారు. 

భుజం గాయంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్‌కు ముందు ఆయన్ను ఏపీ సిట్ అధికారులు కలిశారు. దాడి ఘటనపై జగన్ స్టేటిమెంట్‌ను రికార్డు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదన్నారు. ఇతర ఇన్వెస్ట్‌గేటివ్‌తో వస్తే స్టేటిమెంట్‌ ఇస్తానని తెలిపారు. జగన్ స్టేటిమెంట్ ఇవ్వకపోవడంతో చికిత్సకు సంబంధించిన రిపోర్టులను పోలీసులు తీసుకెళ్లారు.

గురువారం హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం విమానాశ్రయంలో విఐపీ లాంజ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేస్తున్నారు. టీ ఇచ్చేందుకు వచ్చిన ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్ వెయిటర్ శ్రీనివాస్ జగన్ పై కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానని చెప్పి కోడిపందాల కత్తితో దాడి చేశాడు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దాడి జరిగిన తర్వాత ఎయిర్ పోర్ట్ లో ప్రథమ చికిత్స తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్సపొంది శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆస్పత్రిలో వాంగ్మూలం కోసం వచ్చిన ఏపీ పోలీసులకు జగన్ షాక్ ఇచ్చారు. సంఘటన వివరాలు చెప్పాలంటూ 160 సీఆర్పీసీ కింద ఇచ్చిన నోటీసును స్వీకరించలేదు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.