కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకు కటింగ్, షేవింగ్ చేసుకోనని చెప్పిన టీడీపీ ఎంపీ సీఎం రమేశ్.. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరగడంతో మొక్కు తీర్చుకున్నారు. ఆదివారం అర్థరాత్రి కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి మెట్టు మార్గంలో ఆయన కాలినడకన తిరుమల చేరుకుని, శ్రీవారికి తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు.

విభజన చట్టం ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలంటూ ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉక్కు సంకల్పంతో కడపలో ఉక్కు కార్మాగారాన్ని ఏర్పాటు చేసుకున్నామని,  కేంద్రం చేయ్యాల్సిన పనిని రాష్ట్రం చేస్తున్నందుకు కేంద్రప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.  పోలవరం ప్రాజెక్ట్‌ను సమీక్షించినట్లే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపైనా సమీక్ష చేస్తామని, రెండు సంవత్సరాల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని సీఎం రమేశ్ తెలిపారు.