అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజావేదికను తమకు కేటాయించాలని ప్రభుత్వానికి రాసిన లేఖను ప్రస్తావించారు. 

చంద్రబాబు లేఖపై ఆనాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. చంద్రబాబు లేఖపై నువ్వు ఏం అన్నావో గుర్తుందా అని ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. 

చంద్రబాబునాయుడు ప్రతిపక్ష హోదాలో మొదటి లేఖ ప్రజాసమస్యల మీద రాస్తాడు అనుకున్నా కానీ సొంత పనులమీద రాసేంత స్వార్ధపరుడు అనుకోలేదు అన్నావు అంటూ ఆ విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. 

చంద్రబాబు లేఖ గురించి అటు ఉంచితే వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు కేంద్రానికి ఏం లేఖరాశారో చెప్పాలని నిలదీశారు. వైసీపీ ఎంపీలు అందరూ కలిసి మొదటి లేఖ రాష్ట్ర ప్రయోజనాల కోసమో, ప్రత్యేక హోదా కోసమో, నిధుల కోసమో రాస్తారు అని తాను భావించినట్లు తెలిపారు. 

అలాకాకుండా విజయసాయిరెడ్డి తోటి ఖైదీ నిమ్మగడ్డ అరెస్ట్ గురించి రాస్తారనుకోలేదని విమర్శించారు. దేవుడు స్క్రిప్ట్ ఇలాగే రాస్తాడు మరి.. తట్టుకోవాలి అంటూ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు.