చిత్తూరు జిల్లా పలమనేరులో టెన్త్ విద్యార్ధిని ఆత్మహత్య వ్యవహారంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే నారా లోకేష్ స్పందించారు.
చిత్తూరు జిల్లా (chittoor district) పలమనేరులో (palamaner) నిరుపేద టెన్త్ విద్యార్ధిని (10th class student) మిస్బా ఆత్మహత్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ (nara lokesh) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తనదైన శైలిలో ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మిస్బా ఆత్మహత్యకు కారకులుగా నిలిచిన వైసీపీ నేత సునీల్.. అతడికి సహకరించిన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్‌లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.
‘‘ వైకాపన్ల కంటే ఆఫ్ఘన్ తాలిబన్లు నయం. నాయకుడి జగన్‌రెడ్డిదేమో పదో తరగతి పేపర్లు ఎత్తుకొచ్చిన దగుల్బాజీ చరిత్ర అయితే...ఆయన పార్టీ నేతలది పదోతరగతిలో తన కూతురు టాపర్‌గా నిలవాలని నిరుపేద మైనారిటీ విద్యార్థినిని ఏకంగా వెంటాడి.. వేధించి బలవన్మరణానికి పాల్పడేలా చేసిన నీచచరిత్ర. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన నజీర్ అహ్మద్, నసీమాలు కూలి పనులు చేసుకుంటూ, సోడాలు అమ్ముకుంటూ తమ కుమార్తె మిస్బాని బ్రహ్మర్షి హైస్కూలులో చదివించడమే ఆ పేదతల్లిదండ్రుల చేసిన పాపమైపోయింది.
మిస్బా చదువుల్లో మేటిగా రాణిస్తూ పదోతరగతి టాపర్‌గా నిలవడం వైకాపా కాలకేయులకి కన్నుకుట్టింది. వైసీపీ నేత సునీల్ తన కుమార్తె పూజిత టాపర్‌గా రావాలని ప్రిన్సిపాల్‌కి పురమాయించగా..సోడా అమ్ముకునేవాళ్లకు చదువులూ, మార్కులా అంటూ మిస్బాని.. తూలనాడి స్కూల్ నుంచి పంపేయడం చాలా దారుణం. మరో స్కూల్‌లో చేరినా వైకాపా కాలకేయులు సునీల్, ప్రిన్సిపాల్ తనకి చేసిన అవమానం..భవిష్యత్తులోనూ చేస్తామన్న నష్టం హెచ్చరికలు తట్టుకోలేక ఆ చదువులతల్లి బలవన్మరణానికి పాల్పడడం అత్యంత విషాద ఘటన. బంగారు భవిష్యత్తు ఉన్న చదువుల తల్లి మిస్బా మరణానికి కారణమైన వైకాపాకాలకేయుడు సునీల్, ప్రిన్సిపాల్‌లపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
