అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మందడం గ్రామంలో నిరసనకు దిగిన మహిళలపై పోలీసులు లాఠీఛార్జీ చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. శుక్రవారం ట్విట్టర్‌లో స్పందించిన ఆయన ‘‘శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై మీ ప్రతాపం చూపిండం దారుణం వైఎస్ జగన్ గారు.

ఇచ్చిన మాటపై నిలబడండి, మడప తిప్పకండని అక్కాచెల్లెళ్లు అడగటం తప్పా..? లాఠీలతో ఉద్యమాలను అణిచివేయాలని అనుకున్న నియంతలు ఎక్కడ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమరావతిలో పోలీసులు మహిళల గొంతు నొక్కి, ఈడ్చుకెళ్లే ఘటన జగన్‌ గారి నిరంకుశత్వ పాలనకు నిదర్శనం’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 

కాగా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు, విద్యార్ధులు శుక్రవారం ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మహిళలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

పోలీసు వాహనానికి అడ్డంగా పడుకోవడంతో మహిళలను ఈడ్చుకుంటూ వ్యాన్‌లోకి ఎక్కించారు. పలు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు సీఎం జగన్, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఫ్లెక్సీలు చించివేశారు.