ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం కడుతుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అంటూ జగన్ గారు అసెంబ్లీలో చాలా సంస్కారవంతమైన భాషలో అడిగారని... కాళేశ్వరంపై చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం అన్ని పత్రికల్లో వచ్చిందన్నారు.

ఇటువంటివి చూసే సమయం మీకు ఉండి వుండదని... ఎందుకంటే తమరు ఆ సమయంలో గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారేమోనని లోకేశ్ ట్వీట్ చేశారు.

కాగా.. మంగళవారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నదీ జలాలు, ప్రాజెక్ట్‌లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే... ఆల్మట్టి, కాళేశ్వరం కట్టారని... కాళేశ్వరం కడుతుంటే ఆయన గాడిదలు కాశారా అంటూ ప్రశ్నించడంతో సభలో కలకలం రేగింది.

ఆల్మట్టి ఎత్తు పెంచడం బాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగిందని... ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రోజుల్లోనే అవన్నీ జరిగాయని సీఎం గుర్తు చేశారు.

ఇదే సమయంలో తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ శంకుస్థాపనకు వెళ్లినా.. వెళ్లకున్నా స్విచ్చాన్ చేసేవారని.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఔదార్యం చూపుతున్నారని జగన్ స్పష్టం చేశారు.

పక్క రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నందుకు సంతోషించాల్సింది పోయి.. విమర్శిస్తారా అని జగన్ ప్రతిపక్ష సభ్యులను ప్రశ్నించారు. తెలంగాణతో స్నేహభావంతో మెలగడం తప్పా అని నిలదీశారు.

ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉండాల్సిన అవసరం ఉందని.. తెలంగాణ నుంచి రాష్ట్రానికి గోదావరి నీరు ఇస్తున్నారని.. నీటి విషయంలోనూ రాజకీయాలు వెదుకుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ఇలాంటి దిక్కుమాలని ప్రతిపక్షం ప్రపంచంలో ఎక్కడా ఉండదని సీఎం వ్యాఖ్యానించారు.