ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పడానికి కేసుల పెరుగుదలే నిదర్శనమన్నారు  టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. రాష్ట్రంలో మార్చి 21న ఐదు కేసులుంటే.. జూలై 13 నాటికి 31,132 కేసులు నమోదయ్యాయయని.. అయితే కేవలం 13 రోజుల్లోనే 43 వేల కేసులు పెరిగాయని గుర్తుచేశారు.

రేపటికి కేసుల పెరుగుదలలో ఏపీ దేశంలోనే నాలుగో స్థానానికి చేరుకుంటుందని దీపక్ అన్నారు. వైసీపీ నాయకులే ర్యాలీలు, సభలు, పుట్టినరోజు వేడుకలు, ప్రారంభోత్సవాలంటూ కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు 28 మంది వైసీపీ నేతలు, వారి సిబ్బంది కోవిడ్ బారినపడ్డారని దీపక్ రెడ్డి చెప్పారు.

జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేక వీరంతా పక్క రాష్ట్రాల్లో చికిత్స తీసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చివరికి జగన్‌ను దేవడనే విజయసాయిరెడ్డి కూడా పక్క రాష్ట్రంలో చికిత్స పొందడం విడ్డూరంగా ఉందని దీపక్ రెడ్డి సెటైర్లు వేశారు.

నిన్న ఒక్కరోజులో 8,147 కేసులు నమోదైతే ప్రభుత్వం ఎక్కడా దానిపై ఒక్క సమీక్ష కూడా చేసిన పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు. గుడులు, బడులు, అంత్యక్రియలు, పెళ్లిళ్లకు నిబంధనలు పెట్టిన జగన్ ప్రభుత్వం.. జే ట్యాక్స్ కోసం మద్యం దుకాణాలను కొనసాగిస్తోందని దీపక్ రెడ్డి ఆరోపించారు.

పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా తగ్గిపోతుందని, అది సాధారణ వ్యాధేనని, ఇట్స్ కమ్స్ అండ్ గోస్ అన్న జగన్, మంత్రుల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆయన సెటైర్లు వేశారు. ఆఖరికి దాయాదిదేశమైన పాకిస్తాన్ కూడా మనల్ని ఎగతాళి చేసే దుస్థితిని జగన్ ప్రభుత్వం కల్పించిందన్నారు.

వివిధ సంస్థలు, ప్రజలు, కేంద్రం నుంచి వచ్చిన కరోనా నిధులను ప్రభుత్వం ఎక్కడ, ఎంతవరకు ఖర్చుపెట్టిందో చెప్పాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక్క వైసీపీ నేత కూడా ఏనాడూ రాష్ట్రంలోని కోవిడ్ కేంద్రాన్ని సందర్శించలేదని, అక్కడి వారు అనుభవించే బాధలు వారికెలా తెలుస్తాయని నిలదీశారు.

పనితక్కువ, ప్రచారం ఎక్కువైన ఈ ప్రభుత్వం, వేలకోట్ల ప్రకటనలతో సాక్షికి లబ్ధి చేకూర్చడం తప్ప, వైద్యులు, నర్సులు, పోలీసులకు వైద్యపరికరాలు కూడా ఇవ్వలేని హీనస్థితికి దిగజారిందని దీపక్ రెడ్డి ఆరోపించారు.  ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్న విషయాన్ని ప్రజలు గ్రహించి, తమ ప్రాణాలు తామే కాపాడుకోవాలని ఆయన సూచించారు.