అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల మధ్య మళ్లీ ట్విట్టర్ వార్ మెుదలైంది. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

చంద్రబాబు తాగిన నీళ్ల బాటిళ్ల లెక్కలు, తిని వదిలేసిన ప్లేట్ల లెక్కలు కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన పడిన కష్టాన్ని లెక్కేసుకోవాలని సూచించారు. అలా చేస్తే గతంలో మీరు చేసిన దొంగ లెక్కల పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని హెచ్చరించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి చేసిన విమర్శలకు ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు బుద్దా వెంకన్న. దావోస్‌కి వెళ్లి చంద్రబాబు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని అడుగుతున్న విజయసాయి రెడ్డి అసెంబ్లీ సమావేశాల రికార్డులు ఒకసారి వినాలని సూచించారు. 

గత ఐదేళ్లూ రాష్ట్రంలోనే లేకుండా ఢిల్లీలో ఎవరివైనా పాదపూజలు చేశారేమో అంటూ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. పెద్దల సభలో ఉన్నారు కాస్తంతయినా పెద్దరికం తెచ్చుకోండి అంటూ బుద్దా వెంకన్న హితవు పలికారు.