విశాఖపట్నం: వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రకు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉత్తరాంధ్రలో బీసీలు ఎక్కువగా ఉన్నారని... వారిని రాజకీయంగా అణగదొక్కేందుకే విజయసాయి ఆ ప్రాంతంపై దృష్టి సారించారన్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతల అధికారాలను కూడా విజయసాయి రెడ్డే చెలాయిస్తున్నారని వెంకన్న ఆరోపించారు. 

''బలహీన వర్గానికి చెందిన అచ్చెన్నాయుణ్ణి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చేయగానే వైసీపీ వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే వైసీపీకి బీసీలు గుర్తొచ్చారు. అందులో భాగంగానే బీపీ ఫెడరేషన్లు వేశారు. మేము తెచ్చిన బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. మీ వర్గాలకు చెందిన వ్యక్తులను సలహాదారులుగా నియమించి నెలకు రూ.4 లక్షల జీతం ఇస్తున్నారు. ఫెడరేషన్లలో బీసీలకు రూ. 54 వేలు జీతం ఇస్తున్నారు. ఇక్కడే తెలుస్తోంది బీసీలపై మీకున్న చిన్నచూపు'' అని అన్నారు. 

''మాచర్ల ఘటనలో డీఎస్పీ శ్రీహరి మా ప్రాణాలను కాపాడారనే కోపంతో అతన్ని సస్పెండ్ చేశారు. అదే సస్పెండ్ నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డికి వర్తించదా? ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి ఆధిపత్యం తట్టుకోలేక సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు. చివరకు పంచాయితీ పెట్టుకుని అధికారులను పంచుకున్నారు'' అన్నారు. 

''విజయసాయి రెడ్డికి విశాఖలో ఏం పని? పథకం ప్రకారమే విజయసాయి ఉత్తరాంధ్రపై కన్నేశారు. మొత్తం విజయసాయి దోచేస్తున్నారనే కోపంతోనే వైసీపీ నేతలు ధిక్కారస్వరం వినిపించారు. బీసీలపై అంత ప్రేమ ఉంటే వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని నియమించండి. కేంద్ర, రాష్ట్రస్థాయి వైసీపీ అభ్యర్థులు, సలహాదారులంతా  మీ సామాజికవర్గం వారినే పెట్టుకుని బీసీల గురించి మాట్లాడ్డమేంటి?'' అని నిలదీశారు. 

''డిల్లీలో ఎంపీ మిథున్ రెడ్డిని తట్టుకోలేకనే విజయసాయి రెడ్డి గల్లీకి వచ్చిపడ్డారు. బీసీలపై వైసీపీది కపట ప్రేమ. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పతనం ఖాయం. విజయసాయి ఇన్ చార్జ్ గా ఉన్న ఉత్తరాంధ్రలో 39 సీట్లు టీడీపీ గెలుచుకోవడం ఖాయం. ప్రజలు వైసీపీ పాలనను అసహ్యించుకుంటున్నారని వారు చేయిస్తున్న సర్వేల్లోనే తేలుతోంది. ఇక ఎప్పటికీ అధికారంలోకి రామనే నిర్ణయానికి వచ్చిన వైసీపీ నేతలు అందిన కాడికి రాష్ట్రాన్ని దోచేస్తున్నారు'' అని ఆరోపించారు. 

''రూ. 43 వేల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిన రోజును కూడా వైసీపీ నేతలు పండుగలా చేసుకుంటారేమో ! టీడీపీ నేతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలను వేధింపులకు గురిచేస్తూ వైసీపీ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది. ఉత్తరాంధ్రలో విజయసాయి అక్రమాలు , ప్రజా వ్యతిరేక విధానాలపై దమ్ముంటే వైసీపీ నేతలు  బహిరంగ చర్చకు రావాలి.  2024లో బీసీల పార్టీగానే తెలుగుదేశం ఎన్నికలకు వెళుతుంది'' అని వెంకన్న స్పష్టం చేశారు.