కడప: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు రక్షణ లేకుండా పోయిందని టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి ఆందోళన వ్యక్తం చేశారు.  కడప జిల్లాలో గురునాథ్ రెడ్డి హత్యకు ప్రభుత్వానిదే బాధ్యతని... ఈ  హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి రవి డిమాండ్ చేశారు. 
                                 
''గురునాథ్ రెడ్డి హత్యను రాజకీయ హత్యగానో, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో భాగంగానో, ఫ్యాక్షన్ హత్యగానో చిత్రీకరించడం దారుణం. గండికోట ముంపు వాసులకు పరిహారంలో భాగంగా జరిగిన అక్రమాలపై గురునాథ్ రెడ్డి పోరాడారు. జరిగిన అవినీతిపై విచారణ కోరారు.గ్రామసభ కూడా నిర్వహించారు'' అన్నారు. 

''ఆ గ్రామ జనాభా 500. ఓటర్లు 354.  కానీ 750 మందికి ముంపు పరిహారం అందిందని లిస్ట్ తయారుచేశారు. గ్రామ సభ నిర్వహిస్తున్న సందర్భంగా వైసీపీ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం గురునాథ్ రెడ్డిని భయపెట్టింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అవినీతిని ప్రశ్నించినందుకే హత్య చేశారు'' అని ఆరోపించారు. 

''లేని లబ్ధిదారులను సృష్టించి డబ్బు కొట్టేస్తున్నారు. చామలూరులో 520మంది, ఎర్రగూడులో 502మంది లబ్ధిదారులు ఉన్నారని అసత్యాలు చెబుతూ స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడ్డారు. గురునాథ్ రెడ్డి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. దోషులను 306 సెక్షన్ కింద కఠినంగా శిక్షించాలి'' అని రవి డిమాండ్ చేశారు. 

''ప్రభుత్వ పథకాలు అనర్హులకే అందుతున్నారు. రైతులను ఆదుకున్నాం, సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి కన్నబాబు అసత్యాలు చెబుతున్నారు. తుంపర సేద్యానికి డ్రిప్ పరికరాల కోసం చేసిన బకాయిలను ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదు? డ్రిప్ ఇరిగేషన్ కోసం ఏడాదిన్నరలో ఒక్క పరికరం కూడా ఎందుకు ఇవ్వలేదు?'' అని నిలదీశారు.

''గురునాథ్ రెడ్డి కుటుంబాన్ని ఇంతవరకూ వైసీపీ నేతలు పరామర్శించలేదంటే హత్య వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉంది. అవినీతి సొమ్ములో మేజర్ వాటా ఎమ్మెల్యేకు ఉంది. సీఎం సొంత నియోజకవర్గంలోనే రైతులకు రక్షణ లేకుండా పోయింది. రైతుల ఉసురు తీస్తున్న వైసీపీ ప్రభుత్వం....వైఎస్ జయంతి రోజును రైతు దినోత్సవంగా ప్రకటించడం విడ్డూరంగా వుంది'' అని ఎద్దేవా చేశారు.