రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లే ఇప్పడు ఉద్యోగులను కూడా మోసం చేయడానికి సీఎం జగన్ సిద్దమయ్యారని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. అందుకే తేనెపూసిన కత్తిలా తియ్యగా మాట్లాడుతున్నారని అన్నారు. 

అమరావతి: ఉద్యోగులను వంచించినందుకు భవిష్యత్ లో సీఎం వైఎస్ జగన్ (ys jagan) ఫలితం అనభవించి తీరతాడని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు (paruchuri ashok babu) హెచ్చరించారు. ముఖ్యమంత్రిని కలవడమే పెద్ద వరమన్నట్లుగా ఉద్యోగ సంఘాలనేతలు చంకలు గుద్దుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. సాధారణ ఉద్యోగులు, వారి కుటుంబాల బాధ, వ్యధ ఉద్యోగసంఘాల నేతలు ఎందుకు పట్టించుకోరు? అని నిలదీసారు. తాను ఇప్పుడు టిడిపి (TDP) నేతగా కాకుండా ఉద్యోగుల తరుపున గతంలో పనిచేసిన ప్రతినిధిగా ఆవేదనతో మాట్లాడుతున్నానని అశోక్ బాబు పేర్కొన్నారు. 

''ప్రజలను మోసగించినంత తేలికగా, తమను ముఖ్యమంత్రి వంచిస్తాడని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఊహించి ఉండరు. గతంలో ఉద్యోగసంఘ నేతల్లో కొందరు రెండు చేతులతో వైసీపీకి ఓట్లేయించినట్టు చెప్పాడు. అలా చెప్పిన వ్యక్తులను మోసం చేయడం ఇంకా తేలికని జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమైనట్టు ఉంది'' అని అశోక్ బాబు ఎద్దేవాచేశారు.

''నిన్న(గురువారం) సాయంత్రం ముఖ్యమంత్రితో చర్చలు జరిపింది మొదలు రాత్రంతా ఉద్యోగసంఘాల నేతలకు నిద్రపట్టి ఉండదు. 27శాతం ఐఆర్ (IR) ఇచ్చి, ఫిట్ మెంట్ మాత్రం 14.29శాతం కంటే ఇవ్వలేమని చెబితే ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వానికి, పాలకులకు లేకపోతే ఎలా? ఉద్యోగసంఘాల నేతలతో నిన్నచర్చలు జరిపిన ముఖ్యమంత్రి స్వగతానికి, సొంతడబ్బా కొట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. తనచేతికి ఎముకలేదని, తన తండ్రి ఏవేవో చేశాడని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఏవేవో సన్నాయినొక్కులు నొక్కా డు. ముఖ్యమంత్రి మాటలు గమనిస్తే, అసలు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ఆలోచన ఆయనకు ఉందా లేదా అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది'' అన్నారు. 

''ఉద్యోగులను మోసగించడానికే ముఖ్యమంత్రి తేనెపూసిన కత్తిలా మాట్లాడుతున్నాడు. ఉద్యోగుల ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి కొందరు వైసీపీ నేతలు శాస్త్రీయత అంటున్నారు. 27శాతం ఐఆర్ ఇవ్వడానికి ఏ శాస్త్రీయత ఆధారంగా ఒప్పుకున్నారని ప్రశ్నిస్తున్నాం. సీపీఎస్ (CPS) రద్దుచేస్తామని ఏ శాస్త్రీయత ఆధారంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు? ఇవాళ 14.29శాతం ఫిట్ మెంట్ అని ఏ శాస్త్రీయత ప్రకారం చెబుతున్నారు? రాష్ట్రప్రభుత్వ పే స్కేళ్లకు కేంద్రమిచ్చిన 14.29శాతం ఫిట్ మెంట్ కు ఎలా సరిపోతుంది? ఈ రకమైన అవమానం, ఛీత్కారం ఉద్యోగసంఘాలనేతలు భరించడం చూస్తుంటే నాకుకూడా వ్యక్తిగతంగా ఇబ్బందిగానే ఉంది'' అని పేర్కొన్నారు. 

''చాలారాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉద్యోగసంఘాల నేతలతో మాట్లాడటం, కలవడం అరుదుగానే జరుగుతుంది. కానీ ప్రభుత్వప్రధాన కార్యదర్శో, మరొకరో ఉద్యోగులు, ఆయాసంఘాల నేతలతో సంప్రదింపులు జరిపి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి....చేస్తుంటారు కూడా'' అని గుర్తుచేసారు. 

''14.29 శాతం కంటే ఎక్కువగా ఫిట్ మెంట్ ఇవ్వలేమని ప్రభుత్వం ఖరాకండిగా చెప్పేసింది. రెండు, మూడురోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పేశారు. కొందరు ఎంతవస్తే అంతచాలని అనుకునే పరిస్థితులున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో పోలిక వద్దని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాదిరే హెచ్ఆర్ఏ తగ్గించాలని సెక్రటరీ కమిటీ నివేదిక ఇచ్చినప్పుడు, ముఖ్యమంత్రి దానికి ఎలా సమ్మతించారు?'' అని అశోక్ బాబు ప్రశ్నించారు.

''2021 అక్టోబర్ నాటికి రాష్ట్ర ఆదాయం మొత్తం కలిపి లక్షా25వేల111కోట్లు. తెలంగాణ ఆదాయం చూస్తే 90,586.92 కోట్లు. తెలంగాణ కంటే ఏపీ ఆదాయం రూ.35వేలకోట్లు అదనంగా ఉంది. ఉద్యోగులు కూడా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నారు. తెలంగాణతో పోలిస్తే, ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఖర్చుపెడుతున్నది 33శాతం మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం మద్యం అమ్మకాలు, జీఎస్టీ, పెట్రోల్ డీజిల్ ధరలు, ఇతరత్రా పన్నులరూపంలో బాగాపెరిగిందని కాగ్ నివేదికలే చెబుతున్నాయి. ఆదాయవ్యయాల గురించి ఆర్థికశాఖచెప్పిన లెక్కలన్నీ మా వద్ద ఉన్నాయి. వాటిప్రకారమే ఉద్యోగుల తరపున మాట్లాడుతున్నాం. ఉద్యోగుల డిమాండ్లపై, వారి సమస్యలపై ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చాక, ముఖ్యమంత్రితో చర్చలకు సంఘాలనేతలు వెళ్లకుండా ఉండాల్సింది'' అన్న అభిప్రాయం వ్యక్తం చేసారు.

 ''గతంలో చంద్రబాబు అధికారలో వుండగా 20శాతం ఐఆర్ ఇస్తామని చెబితే జగన్ 27శాతం ఇస్తానని చెప్పాడు. ఆనాడు మా జేఏసీ తరుపున ఎవరమూ చంద్రబాబుని అడగలేదు. 27శాతం ఐఆర్ ఇస్తారంటే సాధారణంగానే దానికంటే ఎక్కువగానే ఫిట్ మెంట్ ఉంటుందని ఉద్యోగులంతా ఆశపడతారు. కానీ ఇంత మోసం చేస్తారా? పీఆర్సీ కమిషన్ నివేదిక కూడా ఇప్పటికీ ఉద్యోగులకు ఇవ్వలేదు. ఈవిధంగా ఉద్యోగులను, సంఘాల నేతలను మోసగించి, దారుణంగా వంచించిన ప్రభుత్వం దేశంలో వైసీపీ ప్రభుత్వంతప్ప మరోటి ఉండదు. ఉద్యోగులు ఇప్పటికైనా నీళ్లేవో, పాలేవో తెలుసుకుంటే మంచిది'' అని హెచ్చరించారు.

''వారంలో సీపీఎస్ రద్దుచేస్తామని చెప్పిన వారు నేడు అక్కాబావ కబుర్లు చెబుతున్నారు. ప్రభుత్వం అంటే ఏమిటో, ఎంత ఫిట్ మెంట్ ఇస్తే దానికి ఎంత ఐఆర్ కలపాలో తెలియకుండానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చారా? అధికార పార్టీలో ఉద్యోగసంఘాల నేతలు, ఆర్థిక వ్యవహారాల గురించి తెలిసినవారు ఉన్నారు కదా? వారితో మాట్లాడకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఉద్యోగుల పరిస్థితి పాలు ఇచ్చే ఆవుని వదిలేసి, ఈడ్చి తన్నే దున్నపోతు వద్దకు పాత్ర తీసుకొని వెళ్లినట్టుంది. ఉద్యోగసంఘాల నేతలు ఎందుకింతలా దిగజారారు? కావాల్సిన, రావాల్సిన వాటిపై గట్టిగా డిమాండ్ చేస్తే తుపాకీ పెట్టి కాల్చేస్తారా? ఇప్పుడుండే ఆయన ఇవ్వలేకపోతే, రేపు వచ్చే ఆయన ఇస్తాడు? దానికే ఇంతలా బెంబేలెత్తిపోవాలా?'' అని అన్నారు. 

''గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగులు కోరినవన్నీ నెరవేర్చలేమని... అర్థం చేసుకోమని చెప్పారు. కానీ ఉద్యోగులను ఆయన ఇబ్బంది పెట్టలేదు. తనచేతికి ఎముకలేదని చెప్పుకుంటే సరిపోదు... ఇవ్వాలని మనసులో దానగుణం ఉంటే ఇస్తారు. కర్ణుడు తనదగ్గర ఏమీ లేకపోతే, తన బంగారుపన్నుని ఊడపెరికి దానమిచ్చాడు'' అని గుర్తుచేసారు.