విశాఖపట్నం: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉందంటూ ఆరోపించారు. 

చంద్రబాబు భద్రత విషయంలో సీఎం వైయస్ జగన్ వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. బీఎస్ ఎఫ్ సెక్యూరిటీని తాకట్టుపెట్టొద్దంటూ హితవు పలికారు. చంద్రబాబు నాయుడుకు ఏదైనా జరగరానిది జరిగే ఎవరిది బాధ్యత అంటూ నిలదీశారు. 

సీఎం వైయస్ జగన్ కు పాదయాత్రలో ఏనాడైనా సెక్యూరిటీని తగ్గించడం గానీ కుదించడం కానీ చేసిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ఎయిర్ పోర్ట్ లో తనిఖీ చేయడాన్ని నిరసిస్తూ జీవీఎంపీ గాంధీ విగ్రహం వద్ద శనివారం ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబులు అర్థనగ్న ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. 

ఎయిర్పోర్ట్ లో చంద్రబాబును తనిఖీ చేసి అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్  చంద్రబాబు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇకపోతే గన్నవరం ఎయిర్ పోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. 

ప్రతిపక్ష నాయకుడిని సామాన్య ప్రయాణికుడిలా తనిఖీ చేయడం ఏంటంటూ టీడీపీ నేతలు, పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగుతున్నారు.