విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరనున్నారు. వంశీతో విజయవాడ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుల చర్చలు ఆశించిన ప్రయోజనం సాధించలేదు. దీంతో వల్లభనేని వంశీ వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని సమాచారం. ఈ మేరకు వంశీ తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.

Also read: దేవినేని ఉమతో వల్లభనేని వంశీకి విభేదాలు: చంద్రబాబు లేఖలో ప్రస్తావన

గత నెల 27వ తేదీన గన్నవరం ఎమ్మెల్యే వల్లబనేని వంశీ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ప్రచారం సాగుతోంది.ఈ మేరకు తన అనుచరులకు వంశీ సమాచారం ఇచ్చాడని చెబుతున్నారు.

also read:ఏటూ తేల్చుకోలేని స్థితిలో వల్లభనేని వంశీ: కేశినేని నాని ...

ఈ నెల 1వ తేదీన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు చంద్రబాబునాయుడు. కృష్ణా జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల సందర్భంగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు.

వల్లభనేని వంశీ టీడీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో వంశీతో చర్చించేందుకు  విజయవాడ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావులకు బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు.

also read:జగన్ తో వల్లభనేని వంశీ భేటీ వెనక... టీడీపీ జిల్లా నాయకత్వంపై కార్యకర్తలు ఫైర్...

గత నెల 31వ తేదీన రాత్రి చంద్రబాబు ఆదేశం మేరకు వల్లభనేని వంశీతో కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావులు చర్చించారు. పార్టీలోని అంతర్గత సమస్యలతోపాటు వైసీపీ ప్రభుత్వం తనపై బనాయించిన కేసుల విషయాన్ని కూడ కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావుల దృష్టికి వల్లభనేని వంశీ తీసుకొచ్చినట్టుగా సమాచారం.

అయితే ఈ విషయాలను కేశినేనినాని, కొనకళ్ల నారాయణరావులు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామాలపై వంశీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.

వల్లభనేని వంశీ మాత్రం వైసీపీలో చేరేందుకు కొంత ఆసక్తిని చూపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.ఈ మేరకు వల్లభనేని వంశీ తన అనుచరులకు ఈ విషయాన్ని చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది.

వల్లభనేని వంశీ వైసీపీలో చేరితే ప్రస్తుతం వైసీపీ గన్నవరం అసెంబ్లీ ఇంచార్జీగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ఏ నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఈ నెల మొదటి వారంలో వల్లభనేని వంశీ వైసీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే పార్టీ మారే విషయమై వల్లభనేని వంశీ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. వల్లభనేని వంశీ ఏ నిర్ణయం తీసుకొంటారోననేది కృష్ణా జిల్లా రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

గత మాసం చివరి వారంలో నకిలీ ఇళ్లపట్టాలు ఇచ్చారని వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసు కారణంగానే వంశీ పార్టీ మారాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ప్రచారం సాగుతోంది.