అనంతపురం:  అమరావతిలో చంద్రబాబునాయుడు నివాసం పక్కనే ఉన్న ప్రజా వేదికను కూల్చివేయడం తగదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. 

బుధవారం నాడు ఆయన అనంతపురంలో  ఓ తెలుగు న్యూస్ చానెల్‌తో మాట్లాడారు. ప్రజా వేదికను చంద్రబాబునాయుడు అడిగారనే నెపంతోనే కూల్చివేశారని ఆయన ఆరోపించారు.  నదీపరివాహక ప్రాంతంలోని అన్ని కట్టడాలను తొలగిస్తారా అని ఆయన ప్రశ్నించారు.

ఉరవకొండలో జరుగుతున్న అక్రమాలపై సీఎంకు లేఖ రాస్తానని  పయ్యావుల కేశవ్ చెప్పారు. కిందిస్థాయి ఉద్యోగులను రేషన్ డీలర్లు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలను సీఎం‌కు వివరించనున్నట్టు చెప్పారు.

చంద్రబాబు అమరావతిలో ఇల్లును కట్టుకోలేదన్నారు. ఎవరో కట్టుకొన్న ఇంటిలో చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారని ఆయన  గుర్తు చేశారు. ఈ ఇల్లును వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో నిర్మించారని ఆయన ప్రస్తావించారు.ప్రతిపక్ష నేతపై కక్షసాధింపు, వేధింపు కోణంలోనే చూస్తామన్నారు.