ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘెర పరాజయం చవిచూసింది. వైసీపీ అధినేత అఖండ విజయం సాధించారు. కొన్ని జిల్లాల్లో ఏకంగా క్లీన్ స్వీప్ చేశారు. ఈ ఓటమితో టీడీపీ నేతల్లో అసమ్మతి సెగ మొదలైంది. దీంతో... ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ... ఒక్కో నేత పార్టీని వీడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనూ చాలా మంది నేతలు పార్టీని వీడటం గమనార్హం.

మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అన‌గంటి హ‌రికృష్ణ రాజీనామా చేశారు. ఆయ‌న అనుచ‌రులు కూడా పెద్ద సంఖ్య‌లో తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పారు. అనగంటి హరికృష్ణ గంగాధర నియోజకవర్గం నుంచి పోటీచేయగా... ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి నారాయణ స్వామి 45వేల మెజార్టీతో గెలుపొందారు. 

ఈ ఘోర ఓటమిని తట్టుకోలేక హరికృష్ణ పార్టీని వీడారు. తన అనుచరులతో కలిసి  త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. హరికృష్ణతోపాటు తెలుగుదేశం పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కార్య‌ద‌ర్శి బండి ఆనంద్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. పార్టీలో ఉన్న అన్ని ప‌ద‌వులు స‌హా ప్రాథ‌మిక స‌భ్య‌త్వాన్ని కూడా గుడ్‌బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

ఈ రాజీనామాలు ఇప్పటితో ఆగవని... సీనియర్లు కూడా పార్టీని వీడి వైసీపీలో బెర్తు కన్ఫామ్ చేసుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.