Asianet News TeluguAsianet News Telugu

హోదాపై వైసిపి ఎంపీలు ఏడాదిలో చేసిందిదే...కేంద్రమంత్రి పార్లమెంట్ లోనే: నిమ్మల

పార్లమెంటులో వైసీపీ ఎంపీలు బలం కేసుల మాఫీ, పైరవీలకే పపిచేస్తోందని... లోక్ సభ, రాజ్యసభలో కలిసి ప్రస్తుతం 30 మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలు సున్నా అని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

TDP MLA Nimmala Ramanaidu Shocking Comments on YCP MPs
Author
Amaravathi, First Published Jun 20, 2020, 7:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: పార్లమెంటులో వైసీపీ ఎంపీలు బలం కేసుల మాఫీ, పైరవీలకే పపిచేస్తోందని... లోక్ సభ, రాజ్యసభలో కలిసి ప్రస్తుతం 30 మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలు సున్నా అని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ''గంగిగోవుపాలు గరిటడైనా చాలన్నట్లు'' టిడిపి ఎంపీలు రాష్ట్ర ప్రజల వాణిని పార్లమెంట్ లో   వినిపిస్తున్నారని పేర్కొన్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిని దేశ పటంలో ఉంచడంలో టిడిపి ఎంపీలు కృషే ఇందుకు నిదర్శనమన్నారు. పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాలకోసం కేవలం టిడిపి ఎంపీలు మాత్రమే పోరాటం చేస్తున్నారని నిమ్మల అన్నారు. 

''సిబీఐ, ఈడీ కేసుల్లో సహ నిందితుడికి రాజ్యసభ సీటా? వైఎస్ మృతికి కారకులన్న రిలయన్స్ చెప్పిన వ్యక్తికీ పెద్దల సభా? దళితుల ఓట్లతో అధికారం దక్కించుకున్న ఈ ప్రభుత్వం రాజ్యసభకు ఒక్కరికీ అవకాశమివ్వలేదు. ఏడాదిగా ప్రత్యేక హోదా, రైల్వే జోన్, మెట్రో రైల్ సాధించారా? కేంద్రం మెడలు వంచుతానన్న మీరు కేసుల మాఫీకి సాష్టాంగం పడలేదా? రాష్ట్ర ప్రజలకు పరిశ్రమలేవీ, ఉద్యోగాలు, ఉపాధి ఏదీ?'' అని ప్రశ్నించారు.

''పార్లమెంట్ ఉభయసభల్లో 30 మందికి పైగా వైసీపీ సభ్యులుతో  రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఏడాది కాలంగా రైల్వేజోన్, విభజన హామీల అమలు గురించి వైకాపా ఎంపీలు ఎందుకు నోరు మెదప లేదు? హోదా గురించి వైసీపీ ఎంపీలు ఏడాది కాలంగా ఒక్కసారి మాత్రమే అడిగారని కేంద్రమంత్రి పార్లమెంట్ లో చెప్పడం వాస్తవం కాదా? గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. కడివెడైన నేమి కరముపాలు అన్న విధంగా వైకాపా ఎంపీలు 30 మంది ఉన్నా.. రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం శూన్యం'' అని అన్నారు.

''లోక్ సభలో ముగ్గురు టీడీపీ ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశారు. వైసీపీ కొత్తగా ఇచ్చిన రాజ్యసభ సీట్లు కూడా పైరవీలు చేసుకునేందుకు ఇచ్చినవే. వారితో రాష్ట్రానికి ఉపయోగం ఏమీ ఉండదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది రిలయన్సే అని వైఎస్ విజయ, జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. రిలయన్స్ ఆస్తులు ధ్వంసం చేశారు. వైఎస్ ని చంపిన వ్యక్తి చెప్పాడని పరమళ నత్వానీకి  రాజ్యసభ సీటు కట్టబెట్టడం జగన్  దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం'' అని మండిపడ్డాడు. 

read more  పది పరీక్షలు రద్దు, ఇంటర్ ఫెయిల్ అయినవారు కూడా పాస్: ఏపీ ప్రభుత్వం

'' సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవించారు. ఆయనపై 10 కేసులు ఉన్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడైన అయోధ్య  రామిరెడ్డి జగతి పబ్లికేషన్స్ లో క్విడ్ ప్రో కేసులో ఉన్నారు. జగన్ తో అక్రమాస్తుల కేసుల్లో ముద్దాయిగా ఉన్న మోపిదేవి వెంకటరమణకు రాజ్యసభ పదవి ఇచ్చి సత్కరించారు. తన సహ నిందితుడిని ఆ విధంగా గౌరవించారు. వాన్ పిక్ కేసులో మోపిదేవి నిందితుడు. ఏడాదిన్నర జైలులో గడిపారు. జగన్ తన పైరవీలు చేసుకునేందుకు కేసుల మాఫీకి రాజ్యసభ పదవులు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉండదు'' అని పేర్కొన్నారు. 

''151 శాసనసభ్యులు, 22 ఎంపీలు 51% దళిత ఓట్లతో గెలిచినప్పటికీ ఒక్క రాజ్యసభ సీటు దళితునికి ఇచ్చి గౌరవించకపోవడం దుర్మార్గం. అధికారంలోకి రావడానికి దళితుల ఓట్లే పరమావధి. రాజ్యసభ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లుగా ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఇప్పుడు కూడా రాజ్యసభ పదవులు మాత్రం పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారు. దళితులను వైసీపీ దగా చేసింది. అయోధ్య రామిరెడ్డి, నత్వానీలకు బదులు దళితులకు ఒక్క సీటు కూడా కేటాయించలేరా? వారితో ఓట్లు వేయించుకుని, పదవుల దగ్గరకు వచ్చేసరికి మొండిచేయి చూపారు.  వచ్చే రోజుల్లో మొత్తం 11 రాజ్యసభ సీట్లు వైకాపా సాధించినా రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమీ లేదు'' అని అన్నారు. 

''పైరవీలు, కేసుల మాఫీ కోసం తప్ప వైసిపి ఎంపీల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టమవుతోంది. పార్లమెంటులో ఎంతమంది ఎంపీలున్నా రాష్ట్ర అభివృద్ధికి  ,రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఉపయోగం ఉండదు. వైసీపీ ప్రభుత్వం అగ్రిగోల్ద్ బాధితులకు  గత బడ్జెట్ లో రూ. 1150 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ. 236 కోట్లు మాత్రమె చెల్లించారు. గత తెదేపా హయంలో  అగ్రిగోల్ద్ బాధితులకు చెల్లింపుల కోసం రూ. 540 కోట్లను పక్కదారి పట్టించారు. ఇప్పుడు ఈ ఏడాది బడ్జెట్ లో రూ . 2800 కేటాయిస్తారని ఆశించిన కనీసం 10%  కూడా కేటాయించకుండా రూ. 200కోట్లు కేటాయించి అగ్రి గోల్డ్ బాధితులకు పంగనామం పెట్టారు'' అని నిమ్మల రామానాయుడు  ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios