Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రా ప్రజలను కాదు... ఆస్తులను కాపాడుకోడానికే జగన్ మౌనం: తెలుగురాష్ట్రాల జలజగడంపై నిమ్మల

ఆంధ్రా – తెలంగాణ నీటివివాదాన్ని జాగ్రత్తగా గమనిస్తే కేసీఆర్ , జగన్ ల నిజస్వరూపాలు బయటపడతాయని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. 

TDP MLA Nimmala Ramanaidu Satires on cCM YS Jagan akp
Author
Amaravati, First Published Jul 1, 2021, 5:03 PM IST

అమరావతి: 151సీట్లిచ్చిన ప్రజలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తోందని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. మరీముఖ్యంగా పోలవరం నిర్వాసితులు, ఆదీవాసీలను పోలవరం వరదలో ముంచేసే ప్రయత్నాలకు ప్రభుత్వం సిద్ధమవ్వడం చాలాచాలా దారుణమని వాపోయారు.  

''రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన జీవించేహక్కుని కాలరాసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? 2019కి ముందు పాదయాత్రలో నిర్వాసితుల వద్దకెళ్లిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే   రూ.10లక్షలు ఇస్తానని, ప్రతి కుటుంబానికి ఇళ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చాడు. నేడు అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా నిర్వాసిత కుటుంబాలు వరదలపాలవుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. పిల్లలు, పాపలు, గొడ్డు గోదతో నిర్వాసితులు కొండలు, గుట్టలపైకెక్కి బతుకుజీవుడా అని ఎదురుచూస్తుంటే ఈ ముఖ్యమంత్రి తాపీగా నిన్నటికి నిన్న రూ.550కోట్లు విడుదల చేస్తూ జీవోఇవ్వడం జరిగింది. 18వేల నిర్వాసితుల కుటుంబాలను తరలించడానికి రూ.3,200కోట్లు అవసరమైతే రాత్రికిరాత్రి హడావుడిగా రూ.550కోట్లు ఇస్తున్నట్లు ఈ ప్రభుత్వం జీవోనెం-224 ఇచ్చింది. ఆదీవాసీలు,నిర్వాసితులను ఆదుకునేలా సదరు జీవో లేదు. ఏదోకంటితుడుపుచర్యగా ముఖ్యమంత్రి జీవో ఇచ్చాడుతప్ప, నిజంగా నిర్వాసితులను ఆదుకోవడానికి కాదు'' అని మండిపడ్డారు. 

''పోలవరం నిర్వాసితులకు ఈ ప్రభుత్వం ఇంత అన్యా యం చేస్తున్నా ఎస్టీ వర్గానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ ముఖ్యమంత్రిని ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు. ఆదీవాసీలు, పోలవరం నిర్వాసితులు సహా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నా  అధికారపార్టీ నేతలెవరూ స్పందించడం  లేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు అమలుచేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఏజెన్సీ సబ్ ప్లాన్లను ఈ ముఖ్యమంత్రి పూర్తిగా అటకెక్కించాడన్నారు. పాలకుల నిర్లక్ష్యంతో కొండలు, గుట్టలపాలైన పోలవరం పరిధిలోని ఆదీవాసీలు, నిర్వాసితులకు అండగా టీడీపీ ఉంటుందని, వారిని కష్టకాలంలో ఆదుకోవడానికి చేయాల్సింది చేస్తుంది'' అన్నారు నిమ్మల. 

''ఆంధ్రా – తెలంగాణ నీటివివాదాన్ని జాగ్రత్తగా గమనిస్తే కేసీఆర్ , జగన్ ల నిజస్వరూపం కనిపిస్తుంది.  ఒకపక్క కేసీఆర్ ఆంధ్రాకు రావాల్సిన నీటిని తోడేస్తుంటే జగన్మో హన్ రెడ్డేమో లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తానంటున్నాడు. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే వ్యక్తే సీమకు నీరు లేకుండాచేయాలని చూడటం బాధాకరం. వరద నామమాత్రంగా ఉన్న సమయంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రాజెక్టుల పరిధిలో పోలీసులను ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసుల సాయంతో తెలంగాణ నూటికి నూరుశాతం విద్యుత్ ఉత్పత్తిచేస్తుంటే ఈ ముఖ్యమంత్రి ఏంచేస్తున్నాడు? విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తెలంగాణ తోడేస్తుంటే శ్రీశైలం నుంచి రాయలసీమకు  ఈ ముఖ్యమంత్రి నీటిని ఎలా తరలిస్తాడో సమాధానం చెప్పాలి'' అని నిలదీశారు. 

read more  నాడు సాగర్ వద్ద ఘర్షణ: నేడు ఆ మూడు ప్రాజెక్టుల వద్ద పోలీసుల మోహరింపు, ఉద్రిక్తత

''రైతుల, పోలీసులు తెలంగాణలోనే ఉన్నారా...ఏపీలో లేరా? తెలంగాణలోని ఏపీ ప్రజలకోసం ఆలోచిస్తున్నానని చెబుతున్న జగన్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరానికి వ్యతిరేకంగా నీటిదీక్షల పేరుతో దొంగదీక్షలు ఎందుకుచేశాడు? ఆనాడు తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గుర్తురాలేదా?  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా అంత హాడావుడి చేసిన వ్యక్తే ముఖ్యమంత్రయ్యాక అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిగ్గులేకుండా ఏముఖంపెట్టుకొని వెళ్లాడు?  అక్కడికెళ్లి కొబ్బరికాయలు కొట్టి, బటన్లునొక్కి, ఎందుకు తెగ సంబరపడ్డాడు?అధికారంలో ఉన్నప్పుడుఒకలా, ముఖ్యమంత్రయ్యాక మరోలా ప్రవర్తించడం జగన్ కు కొత్తేమీకాదు'' అని మండిపడ్డారు. 

''తెలంగాణ భూభాగం నుంచి కృష్ణా జలాలను రాయలసీమకు తరలిస్తామని ఈ ముఖ్యమంత్రి ప్రజల చెవుల్లో పూలు పెట్టాలని చూశాడు. ఆనాడే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు  మన నీళ్లు మన భూభాగంలోనుంచే వెళ్లాలని చెప్పడం జరిగింది. అలాకాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే జలజగడాలు, నీటియుద్దాలు జరుగుతాయని కూడా చంద్రబాబు హెచ్చరించడం జరిగింది. చంద్రబాబు వ్యాఖ్యలపై పరిహాసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆనాడు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచేసి సిగ్గూఎగ్గూలేకుండా ప్రవర్తించాడు.  తెలంగాణతో ఉన్న నీటి వివాదాలు, విద్యుత్ బకాయిలు, హైదరాబాద్ లోఉన్న ఏపీ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకుండా, ఏపీకి చెందిన ఆస్తులను పొరుగు రాష్ట్రానికి అప్పగించవద్దని చెప్పినా ఈ ముఖ్యమంత్రి ఖాతరు చేయలేదు. తన ఆస్తులను కాపాడుకోవడానికి రాష్ట్రానికి చెందిన ఆస్తులను అప్పనంగా కేసీఆర్ పరంచేశాడు'' అని నిమ్మల ఆరోపించారు. 

''2019అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డికి చేసిన సాయానికి గుర్తుగా నేడు రాయలసీమ రైతుల హక్కులను పొరుగు ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టడానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు. గతంలో తాను అక్రమంగా, అన్యాయంగా, అవినీతికి పాల్పడి సంపాదించిన అనేక భూములు, ఇతరత్రా ఆస్తులు తెలంగాణలో ఉన్నాయన్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి నీటి వివాదాలపై లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తానంటున్నాడు. ఇటువంటి జల జగడాలు తలెత్తుతాయని భావించే చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మాణాన్నిప్రారంభించి, నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాడు. జగన్ అధికారంలోకి వచ్చాక నదుల అనుసంధానం సహా పోలవరం ప్రాజెక్ట్ ను కూడా అటకెక్కించి, నిర్వాసితులను గాలికొదిలేశాడు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేల్కొని, రాయలసీమ, డెల్టా ప్రాంత రైతుల మనోభావాలను, హక్కులను తాకట్టుపెట్టే చర్యలకు స్వస్తిచెప్పాలి. లేకుంటే భవిష్యత్ లో రైతుల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి శత్రువుగా మిగిలిపోతాడు'' అని టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు హెచ్చరించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios