అమరావతి: ఏపీలో కరోనా వైరస్  విలయతాండవం చేస్తుంటే సిఎం జగన్ మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నవరత్నాలపై దృష్టి పెట్టారని మాజీ ఉపముఖ్యమంత్రి, టిడిపి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా నిరుపేదలకుఇళ్ళ స్థలాల కోసం భూములు సేకరణ పేరుతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

''కాకినాడ, రాజానగరం నియోజకవర్గాలలో లోతట్టు ప్రాంతాలను ఇళ్ళ స్థలాలుకై భూములు సేకరిస్తున్నారు. నివాసయోగ్యానికి పనికిరాని భూములకు రెట్టింపు  రేట్లు ప్రజాప్రతినిధుల ఒత్తిడితో చెల్లిస్తున్నారు. ఇళ్ళ స్థలాలకు ఇవ్వాలనుకున్న మడ అడవుల భూములకు కేంద్రం అడ్డుకట్ట వేసింది'' అని పేర్కొన్నారు. 

''ఆదాయం కోసమే మద్యం షాపులు రేట్లు పెంచి అమ్మడానికి అనుమతి ఇచ్చారు. మద్యపాన నిషేధమని చెప్పిన వైసీపీ దానిపై ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రయత్నిస్తోంది. సేల్స్ టాక్స్ పోయినందున అర్జంట్ ఆదాయం కోసం లాక్ డౌన్ లోనే దుకాణాలు తెరవాలని తహతహలాడుతున్నారు'' అని ఆరోపించారు. 

''తిరుమల లో స్వామివారి దర్శనం కోసం వైవి సుబ్బారెడ్డి వేరే రాష్ట్రం నుంచి ఎలా వస్తారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎలా దర్శనం చేసుకుంటారు. ఆయనపై ఏం చర్య తీసుకుంటారు?ప్రజలకో న్యాయం...వైసీపీ నేతలకో న్యాయమా..?'' అని ప్రశ్నించారు. 

''హైదరాబాద్ నుంచి చంద్రబాబు వస్తానంటే లాక్ డౌన్ నిబంధనలు అంటున్నారే. మరి సుబ్బారెడ్డి వాటిని ఉల్లంఘించి వైవి సుబ్బారెడ్డి కుటుంబంతో సహా తిరుమలకు ఎలా వస్తారు. నిబంధనలు ఆయనకు వర్తించవా..మీడియా గొంతు నొక్కడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు'' అంటూ మాజీ డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు.