సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోయపాటి సినిమా తర్వాత తానేం చేయబోతున్నానో ఓ అభిమానితో మాట్లాడిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేనికైనా రెడీ ఇక జనంలోనే ఉంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో అర్థమేంటి అంటూ బాలయ్య ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని రుద్రకోటలో నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా స్థానికంగా వున్న టీడీపీ, బాలకృష్ణ అభిమానులతో ఆయన మాట్లాడారు. అదే సమయంలో బాలకృష్ణకు కోటంరెడ్డి ఫోన్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు బాలయ్య.

బోయపాటి సినిమా తర్వాత  నేనేంటో చూపిస్తానంటూ ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. ఇలాంటి పరిపాలన గతంలో ఎన్నడూ చూడలేదని బాలకృష్ణ ధ్వజమెత్తారు.

ఉత్తర భారతదేశంలోని యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో అరాచకాల గురించి వింటామని, కానీ ఈ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని ఆయన ఆరోపించారు. అభిమానులతో తనది జన్మజన్మల అనుబంధమని..ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే సహించబోమని వెల్లడించారు.

తాను మానసికంగా ప్రిపేర్ అవుతున్నానని.. దేనికీ భయపడొద్దు, అయ్యేదేదో అవుతుందని బాలయ్య స్పష్టం చేశారు. రాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడని.. ఇదీ అంతేనని వ్యాఖ్యానించారు. అన్నగారితో ఆంధ్రుల అనుబంధం ప్రలోభాలకు లొంగనిదన్నారు. వైసీపీ ఇప్పుడు చేస్తున్న వాటికి వంద రెట్లు చూపిద్దామని బాలకృష్ణ పిలుపునిచ్చారు.