బాలయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న టీడీపీ నేతలు
సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. అభిమానులకు అభివాదం చేస్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న ప్రచార వాహనం ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఆయన వెనక్కి పడిపోయారు.

సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. హిందూపురం పర్యటనలో భాగంగా కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా.. వాహనం ముందుకు కదలడంతో ఒక్కసారిగా వెనక్కిపడిపోయారు బాలయ్య. వెంటనే అప్రమత్తమైన టీడీపీ నేతలు ఆయన్ను పట్టుకున్నారు.
అంతకుముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేక ప్రజలు వలస వెళ్తున్నారన్నారు. ఉపాధి లేక ప్రజలు వలస వెళ్లడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని.. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బాలయ్య జోస్యం చెప్పారు. రాయలసీమ అంటే రతనాల సీమగా పేరున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాంటి రాయలసీమ నుండి ఉపాధి లేక నిరుద్యోగులు వలస వెళ్తున్నారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని బాలకృష్ణ దీమాను వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ALso REad: నన్ను అలా పిలిస్తే దబిడి దిబిడే: జగన్ సర్కాపై బాలకృష్ణ ఫైర్
చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగాలు కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ సర్కార్ అవలంభిస్తున్న విధానాల కారణంగా చదువుకున్న వారికి ఉద్యోగాలు లేకుండా పోయాయన్నారు. ఆనాడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్ అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో అనంతపురంలో కియా పరిశ్రమను ఏర్పాటు చేసిన విషయాన్ని బాలకృష్ణ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉపాధి లేకుండా పోయిందన్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల తో ప్రభుత్వంపై పోరాటం చేయాలని బాలకృష్ణ ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ ఒక్క అంబేద్కర్, ఎన్టీఆర్ కావాల్సిన అవసరం ఉందన్నారు. తన సినిమాల్లో వినోదం విజ్ఞానం తో పాటే సందేశం కూడా ఉంటుందన్నారు. టాక్ షోలతో ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నానని బాలకృష్ణ చెప్పారు. తనకు 60 ఏళ్లు వచ్చిందని వయస్సు పైబడిందని ఎవరైనా అంటే వారికి దబిడి దిబిడే అంటూ నవ్వుతూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు.సేవ చేయాలంటే అధికారం ఉండాల్సిన అవసరం లేదని.. అభివృద్ది చేయాలంటే అధికారం అవసరమని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.