హిందుపురాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అవసరమైతే ఈ విషయంపై సీఎం జగన్‌ని కలుస్తానని బాలయ్య చెప్పారు.

హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని .. ఇప్పటికే ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చారని బాలయ్య మండిపడ్డారు.

ఇంటి పట్టాల పంపిణీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బాలయ్య దుయ్యబట్టారు.

ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని.. మంత్రులు, నాయకులు భయం, భక్తి లేకుండా.. చట్టాలంటే లెక్కలేని విధంగా మాట్లాడుతున్నారని బాలయ్య దుయ్యబట్టారు. ప్రస్తుతం దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతోంది.

ఇందులో దేవతలు టీడీపీ వాళ్లయితే... రాక్షసులు వైసీపీ వారని ఆయన సెటైర్లు వేశారు. పేకాట ఆడితే తప్పేంటన్న మంత్రి కొడాలి నాని.. నోరు అదుపులో పెట్టుకోవాలని బాలకృష్ణ సూచించారు